Fake News, Telugu
 

రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన ట్వీట్లను తొలగించాడని జరుగుతున్న ప్రచారం అవాస్తవం

0

ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వినాయక్సా దామోదర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ సావర్కర్ మనుమడైన రంజిత్ సావర్కర్ రాహుల్ గాంధీ పై కేసు పెడతానని చెప్పిన నేపథ్యంలో, రాహుల్ గాంధీ తాను ఇదివరకు సావర్కర్ పై చేసిన ట్వీట్లను తొలగించాడని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: సావర్కర్‌పై ఇదివరకు చేసిన ట్వీట్లను రాహుల్ గాంధీ తొలగించారు.

ఫాక్ట్: సావర్కర్‌పై రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఎటువంటి ట్వీట్ చేయలేదు గనుకనే ఆయన ఖాతాలో ఈ సమాచారం లభించలేదు. 25 మార్చి 2023 తర్వాత రాహుల్ గాంధీ తన ఖాతానుంచి ఎలాంటి  ట్వీట్లను తొలగించలేదని ఆధారాలు ఉన్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, రాహుల్ గాంధీ 25 మార్చి 2023న జరిగిన ప్రెస్ మీట్‌లో సావర్కర్‌పై వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై స్పందిస్తూ రంజిత్ సావర్కర్ మార్చి 28న రాహుల్ గాంధీపై కేసు నమోదు చేస్తానని పేర్కొన్నారు.

ఇక ఈ సంఘటన జరగక ముందు ఆర్కైవ్ చేయబడిన రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతా యొక్క పేజీ ప్రకారం, 25 మార్చి 2023 10:04 AM (UTC) వరకు మొత్తం రాహుల్ గాంధీ 6,782 ట్వీట్లు చేసినట్లు గుర్తించాము.

ఈ ఆర్టికల్ రాసే సమయానికి, అనగా 31 మార్చి 2023 మధ్యాహ్నం 12 గంటల వరకు, రాహుల్ గాంధీ తన ఖాతా నుంచి మొత్తం 6,790 ట్వీట్లు చేసినట్లు గుర్తించాము. అంటే ఆయన 8 ట్వీట్లు అదనంగా చేసి ఉండాలి. 25 మార్చి సాయంత్రం 6:03 నుంచి 30 మార్చి సాయంత్రం 5:59 వరకు రాహుల్ గాంధీ 8 ట్వీట్లను చేసినట్లు గుర్తించాము.

దీనితో ప్రస్తుతం రాహుల్ ఖాతాలో ట్వీట్ల సంఖ్య 6,790గా ఉంది. ఒకవేల ఆయన సావర్కర్‌పై ట్వీట్లను తొలగించి ఉంటే ఆయన ఖాతాలో ట్వీట్ల సంఖ్య 6,790 కంటే తక్కువగా ఉండేది. రాహుల్ గాంధీ 25 మార్చి నుంచి 30 మార్చి వరకు ఎటువంటి ట్వీట్లను తొలగించలేదని సోషల్ బ్లేడ్ అనే సోషల్ మీడియా విశ్లేషణ సంస్థ గణాంకాలలో కూడా చూడవచ్చు.

ఇక రాహుల్ గాంధీ అనేక సార్లు సావర్కర్ గురించి మాట్లాడారు కానీ, ఆయన గురించి ట్విట్టర్లో ఎక్కడా ప్రస్తావించినట్లు సమాచారం లేదు. మీడియా కూడా దీని గురించి ఎక్కడా రిపోర్ట్ చేయలేదు.

చివరిగా, రాహుల్ గాంధీ సావర్కర్ పైన ఇప్పటివరకు ఎటువంటి ట్వీట్ చేయలేదు గనుకనే ఆయన ఖాతాలో వెతికినప్పుడు ఎటువంటి సమాచారం దొరకదు. అంతే కానీ, సావర్కర్‌పై ట్వీట్ చేయడం వలను కాదు.

Share.

About Author

Comments are closed.

scroll