Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోని ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై ప్రధాని మోదీ మొదటిసారి లోక్‌సభలో మాట్లాడిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటి సారి లోక్‌సభలో  మాట్లాడిన దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. దీంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మొట్టమొదటి సారి లోక్‌సభలో మాట్లాడిన దృశ్యాలు.

ఫాక్ట్: 2019 ఫిబ్రవరి నెలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో నరేంద్ర మోదీ ప్రసంగం దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. రాఫేల్‌  కుంభకోణం, నల్ల ధనం వెలికితీత గురించి ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్ గురించి నరేంద్ర మోదీ ఈ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 2019 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాధ్యతలు చేపట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2020 జనవరి నెలలో ఆమోదించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Sansad TV’ ఛానల్ వారు 08 ఫిబ్రవరి 2019 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 07 ఫిబ్రవరి 2019 నాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న దృశ్యాలని ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలోని 47:09 నిమిషాల దగ్గరి నుండి పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే దృశ్యాలను మనం చూడవచ్చు.

యూపీఏ ప్రభుత్వంలో రక్షణ ఒప్పందాలేవీ కూడా దళారులు లేకుండా జరుగలేదని, దేశ వైమానిక దళం పారదర్శకత, నిజాయితీతో పటిష్టం అవుతుంటే అది కాంగ్రెస్ జీర్ణించుకోవట్లేదని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఆరోపించారు. రాఫేల్‌ కేసు విచారణలో భాగంగా ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురు దళారులు పట్టుబడటంతో కాంగ్రెస్ కంగారుపడుతుందని నరేంద్ర మోదీ ఆరోపించారు. నరేంద్ర మోదీ ఈ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. నరేంద్ర మోదీ 07 ఫిబ్రవరి 2019 నాడు లోక్‌సభలో చేసిన ప్రసంగం యొక్క డాక్యుమెంట్ కాపీని ఇక్కడ చూడవచ్చు.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి 2019 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2020 జనవరి నెలలో ఆమోదించింది. అంటే, పోస్టులో షేర్ చేసిన వీడియో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టకముందు జరిగిన లోక్‌సభ మీటింగ్ లోని దృశ్యాలని స్పష్టమయ్యింది. మూడు రాజధానుల బిల్లు గురించి వై.ఎస్.జగన్, నరేంద్ర మోదీతో పలు సార్లు చర్చలు జరిపినట్టు తెలిసింది. కానీ, ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల గురించి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రస్తావన తెచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

చివరగా, సంబంధంలేని పాత వీడియోని ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి లోక్‌సభలో మాట్లాడిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll