Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోలను ఇజ్రాయెల్ మహిళలు ఆయుధాలు చేత పట్టుకొని పాలస్తీనాతో ఇప్పుడు యుద్ధం చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మహిళలు ఆయుధాలు పట్టుకొని పాలస్తీనాతో యుద్ధం చేస్తున్న ఇటీవల చిత్రాలంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ) బాగా షేర్ అవుతున్నాయి. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇజ్రాయెల్ మహిళలు ఆయుధాలు పట్టుకొని పాలస్తీనాతో యుద్ధం చేస్తున్న ఇటీవల చిత్రాలు.

ఫాక్ట్ (నిజం): 2019లో ‘సిల్వర్ రొసెస్’ అనే సంస్థ నిర్వహించిన ‘Defend Children’ క్యాంపైన్లో భాగంగా తీసిన ప్రచార చిత్రాన్ని మొదటి ఫోటో చూపిస్తుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సులో (IDF) రిజర్విస్టుగా ఒకప్పుడు పనిచేసి ప్రస్తుతం పాడ్కాస్ట్ హోస్టుగా, మోడలింగ్ చేస్తున్న ఓరిన్ జూలీ యొక్క పాత ఫోటోని మరో పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టులలో షేర్ చేసిన ఫోటోలు అన్నీ పాతవి, ప్రస్తుత ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధానికి సంబంధించినవి కావు. కావున, పోస్టులో షేర్ చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఫోటో-1 :

ఇజ్రాయెల్ మహిళ ఒక చేతిలో బిడ్డను, మరొక చేతితో తుపాకి పట్టుకొని పాలస్తీనా మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే చిత్రాన్ని షేర్ చేస్తూ 2019లో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. ‘సిల్వర్ రొసెస్’ సంస్థ నిర్వహించిన ‘Defend Children’ క్యాంపైన్లో ఈ ఫోటోని తీసినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. ఈ ఫోటోని ‘సిల్వర్ రొసెస్’ సంస్థ 2019 సెప్టెంబర్ నెలలో తమ ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేశారు. ‘సిల్వర్ రొసెస్’ అని యుక్రెనియన్ అక్షరాలతో ఈ ఫోటోపై వాటర్ మార్క్ ఉంది. ‘సిల్వర్ రొసెస్’ సంస్థ నిర్వహించిన మారికొన్ని ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది అని, ప్రస్తుత ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధానికి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2 :

దేశానికి ఆపద వచ్చిందని ఇజ్రాయిల్‌లోని మహిళలు తుపాకీలు పట్టుకొని పాలస్తీనాతో యుద్ధం చేస్తున్న చిత్రమంటూ మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

ఈ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోలలో కనిపిస్తున్నది ‘క్వీన్ ఆఫ్ గన్స్’గా పిలవబడే  ఓరిన్ జులి అనే ఇజ్రాయెల్‌ మాడెల్ అని తెలిసింది. ఈ ఫోటోలని ఓరిన్ జులి చాలా కాలం కిందటే తన ఇంస్టాగ్రామ్ పేజీలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సులో (IDF) ఒకప్పుడు రిజర్విస్టుగా పనిచేసిన ఓరిన్ జూలీ, ప్రస్తుతం పాడ్కాస్టూలు నిర్వహిస్తూ, అనేక వాణిజ్య ప్రకటనలకు మోడలింగ్ చేస్తున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అంతేకాదు, తను తుపాకీల యాక్ససరీస్ స్టోర్ ఒకటి కూడా నడుపుతున్నట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఓరిన్ జూలీ ఇటీవల పబ్లిష్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  

చివరగా, సంబంధం లేని పాత ఫోటోలను ఇజ్రాయెల్ మహిళలు ఆయుధాలు చేత పట్టుకొని పాలస్తీనాతో ఇప్పుడు యుద్ధం చేస్తున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll