Fake News, Telugu
 

సంబంధంలేని పాత ఫోటోలను ట్రాక్టర్ ర్యాలీలో రైతులపై పోలీసుల దాడి అంటూ షేర్ చేస్తున్నారు

0

రైతు వ్యతిరేక చట్టాల పైన పోరాడుతున్న రైతులపై పోలీసుల దాడి అని చెప్తూ, గాయపడ్డ ఒక సిక్కు వ్యక్తి ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు ఒక వ్యక్తిపై దాడి చేస్తున్న ఫోటో ఒకటి ఇదే నేపధ్యంలో షేర్ అవుతున్న పోస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఈ రెండు పోస్టులలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతు వ్యతిరేక చట్టాల పైన పోరాడుతున్న రైతులపై పోలీసుల దాడికి సంబంధించిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఒక సిక్కు వ్యక్తి వీపుపై గాయలున్న ఫోటో నిజానికి 2019లో ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో ఒక టెంపో డ్రైవర్ కి మరియు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించింది. ఫోటోలో ఉన్నది ఆ దాడిలో గాయపడ్డ డ్రైవర్.   పోలీసులు కింద పడ్డ ఒక సిక్కు వ్యక్తిని తంతున్న ఫోటో నిజానికి 2013లో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ ను నిర్దోషిగా ప్రకటించినందుకు నిరసనగా కొందరు సిక్కుల అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం వైపు వెళ్ళడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నప్పుడు జరిగిన ఘర్షణలో తీసింది. ఈ ఫోటోలకు ఇటీవల జరిగిన ట్రాక్టర్ ర్యాలీకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టు 1:

పోస్టులోని ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే ఫోటోలు ప్రచురించిన ఒక 2019 ఆన్‌లైన్ వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం 16 జూన్ 2019న ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో ఒక టెంపో డ్రైవర్ కి మరియు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు ఆ డ్రైవర్ పై దాడి చేసారు, పోస్టులో ఉన్నవి ఆ దాడిలో గాయపడ్డ డ్రైవర్ ఫొటోలే. ఇంకా ఈ కథనం ప్రకారం డ్రైవర్ ని గాయపరిచిన పోలీసులను సస్పెండ్ కూడా చేసారు. 

ఈ కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించి 2019కి చెందిన చాలా వార్తా కథనాలు మరియు న్యూస్ వీడియోస్ మాకు కనిపించాయి. ఈ కథనాలు కూడా పైన పేర్కొన్న విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఈ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా ఈ ఫోటోలు రిపబ్లిక్ డే రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించినవి కావని కచ్చితంగా చెప్పొచ్చు.

పోస్టు 2:

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన ఒక 2013 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో 1984 లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ ను నిర్దోషిగా ప్రకటించినందుకు నిరసనగా కొందరు సిక్కుల అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం వైపు వెళ్ళడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నప్పుడు జరిగిన ఘర్షణలో తీసింది.

ఈ కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించి 2013కి చెందిన చాలా వార్తా కథనాలు మరియు న్యూస్ వీడియోస్ మాకు కనిపించాయి, వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా ఈ ఫోటో రిపబ్లిక్ డే రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించినవి కావని కచ్చితంగా చెప్పొచ్చు

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతులకు మరియు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిన నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, సంబంధంలేని పాత ఫోటోలను ట్రాక్టర్ ర్యాలీలో రైతులపై పోలీసుల దాడి అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll