Fake News, Telugu
 

పీఎం కిసాన్ FPO యోజన కింద 750 మంది ఉన్న ఒక్క FPOకు కేంద్రం 15 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఈక్విటీ అందిస్తుంది

0

రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన  పీఎం కిసాన్ FPO యోజన కింద కొంతమంది రైతులు కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయలు అందజేస్తోందని చెప్తున్న వార్తా కథనం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.  ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి 11 మంది రైతులు ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలిని, దీనివల్ల రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేయడం సులభతరం అవుతుందని ఈ కథనంలో చెప్తున్నారు. ఐతే ఈ వార్తలో నిజమెంతుందో ఈ కథనం ద్వారా చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ FPO యోజన కింద కొంతమంది రైతులు కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయలు అందజేస్తోంది.

ఫాక్ట్(నిజం):  పీఎం కిసాన్ FPO పథకం కింద 15-20 మంది కలిగి ఉన్న 20 లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్‌లను కలిపి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా (FPO) పరిగణిస్తారు. ఒక FPOలో కనీసం 300 మంది ఉండాలి.  ఇలా ఏర్పడిన ఒక్కో FPOకు ప్రభుత్వం గరిష్టంగా రూ. 15 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ ఈక్విటీ అందిస్తుంది. అంటే ఒక FPO గరిష్టంగా 15 లక్షల ఈక్విటీ పొందాలంటే ఆ FPOలో సుమారు 750 మంది రైతులు ఉండాలి. దీనిని కొన్ని సంస్థలు తప్పుగా అర్ధం చేసుకొని 11 మంది సభ్యులకు కేంద్రం 15 లక్షలు ఇస్తుందని ప్రచారం చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రైతుల ఆదాయం పెంచే ఉద్దేశంతో 2020లో కేంద్ర ప్రభుత్వం  పీఎం కిసాన్ FPO (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి మరియు మార్కెటింగ్ పెంచే విధంగా రైతులను సంఘాలుగా సంఘటితం చేసి వారికి ఆర్ధిక సహయం అందించటం ద్వారా రైతుల ఆదాయం పెంచటం ఈ పథకం యొక్క లక్ష్యం.

పీఎం కిసాన్ FPO యోజన:

పథకం గైడ్లైన్స్ ప్రకారం ముందుగా గ్రామ/క్లస్టర్ స్థాయిలో ఒకేరకమైన ఆసక్తి ఉన్న 15-20 మందిని ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేయాలి. ఈ రకంగా ఏర్పాటు చేసిన 20 లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్‌లను కలిపి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా (FPO) పరిగణిస్తారు. ఒక FPOలో కనీసం 300 మంది ఉండాలి. అదే కొండ ప్రాంతాలు మరియు ఈశాన్య ప్రాంతాలలో 7-8 గ్రూప్‌లను కలిపి ఒక FPOగా ఏర్పాటు చేయాలి.

ఇలా ఏర్పడిన FPOలు కేంద్రంలోని కంపెనీస్ ఆక్ట్ లేదా రాష్ట్రంలోని  కోఆపరేటివ్ సొసైటీస్ కింద రిజిస్టర్ అవ్వాలి. ఇలా ఏర్పడిన FPOలు స్వతహాగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్స్, మొదలైనవి సప్లై చేయడం/టిల్లర్, స్ప్రింక్లర్ సెట్, హార్వెస్టర్ వంటి వ్యవసాయ యంత్రాలు అద్దెకు ఇవ్వడం/ వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా వంటి లాజిస్టిక్స్ సేవలను అందించడం మొదలైన వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ఈ FPOలను ప్రోత్సహిస్తుంది.

FPOల నిర్వహణకు ప్రభుత్వ సహాయం:

ప్రతీ FPOకు గరిష్టంగా 18 లక్షలు వరకు మూడేళ్ళ పాటు ప్రభుత్వం సహాయాన్ని అందిస్తుంది. ప్రభుత్వం అందించే ఈ ఆర్ధిక సహయంతో సిబ్బంది జీతాలు, రెంట్స్,  నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు మొదలైనవాటికి ఉపయోగించవచ్చు. ఈ సహాయం FPO నిర్వహణ కోసం చేసేదే తప్ప, ప్రత్యేకంగా ఒక్కో రైతుకు ఇచ్చేది కాదు. కాగా నాలుగో సంవత్సరం నుండి ప్రభుతం ఈ సహాయం చేయదు, FPOలు ఈ ఖర్చుల కోసం తమ ఆర్ధిక వనరులను తామే సృష్టించుకోవాలి.

ప్రభుత్వం ప్రతీ సభ్యునికి ఈక్విటీ అందిస్తుంది:

సాధారణంగా ఈ FPOలు బ్యాంకులు/ ఆర్ధిక సంస్థల వద్ద నుండి లోన్‌లు తీసుకొని ప్రాజెక్టులు నిర్వహించి తమ వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. ఐతే ఈ FPOలను ఆర్ధికంగా బలోపేతం చేసి, అవి సులభంగా రుణాలు పొందే విధంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతీ ఒక్క సభ్యునికి గరిష్టంగా రూ. 2000 మ్యాచింగ్ ఈక్విటీ గ్రాంట్ (తన సొంత ఈక్విటీకి/ఆ వ్యాపారంలో తన షేర్/వాటాకు అనుగుణంగా) అందిస్తుంది. ఇలా చేయడం ద్వారా FPOలో సభ్యుల వాటా ఆధారంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఐతే ప్రభుత్వం ఒక్కో FPOకు గరిష్టంగా రూ. 15 లక్షలు మాత్రమే ఈక్విటీ అందిస్తుంది. అంటే ఒక FPO గరిష్టంగా 15 లక్షల ఈక్విటీ పొందాలంటే ఆ FPOలో సుమారు 750 మంది రైతులు ఉండాలి.

ఐతే ప్రభుత్వం సభ్యునికి గరిష్టంగా రూ. 2000 ఈక్విటీ అందించే ఈ నియమాన్ని తప్పుగా అర్ధం చేసుకొని, కేంద్ర ప్రభుత్వం 11 సభ్యుల FPOకు 15 లక్షలు ఇస్తుందని వార్తలు ప్రచురించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, hmtv, news18, దిశ, zee న్యూస్, tv9,సాక్షి, ABP, మొదలైన వార్తా సంస్థలు ఈ వార్తను ప్రచురించాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టు కూడా ఇలా అసంపూర్ణ సమాచారం అందిస్తుంది.

కాని పైన చెప్పినట్టు 750 మంది ఉన్న ఒక FPOకు ప్రభుత్వం 15 లక్షల ఈక్విటీ అందిస్తే నికరంగా ఒక్కో సభ్యునికి వచ్చేది గరిష్టంగా రూ. 2000 మాత్రమే. ఈ FPOల బలోపేతానికి ఈక్విటీ అందించడమే కాకుండా, ఇవి నిర్వహించే  ప్రాజెక్ట్‌ల కోసం తీసుకునే లోన్‌లకు సంబంధించి 2 కోట్ల వరకు క్రెడిట్ గ్యారంటీ కూడా ఇస్తుంది.  ఈ FPOలకు అవసరమైన శిక్షణ, పర్యవేక్షణ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది.

చివరగా, పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన కింద 750 మంది ఉన్న ఒక్క ఎఫ్‌పీఓకు కేంద్రం 15 లక్షల ఈక్విటీ అందిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll