05 ఆగస్టు 2020 న అయోధ్య లో రామ మందిరం యొక్క భూమి పూజ జరుతున్న సందర్భంగా, అయోధ్య కి సంబంధించిన వీడియోలని చెప్తూ రెండు వీడియోలను సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్య రామ మందిరం భూమి పూజకి సంబంధించిన అలంకరణ మరియు లేజర్ షో వీడియోలు.
ఫాక్ట్ (నిజం): అయోధ్య రామ మందిరం భూమి పూజ సందర్భంగా అయోధ్య లోని అనేక ప్రదేశాలను అలంకరించిన మాట వాస్తవమే, కానీ పోస్ట్ చేసిన వీడియోలు పాతవి. అసలు అవి అయోధ్య కి సంబంధించిన వీడియోలు కూడా కావు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియో ఇంటర్నెట్ లో కనీసం ఫిబ్రవరి 2020 నుండి ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఒక యూట్యూబ్ యూసర్ ఆ అలంకరణ హైదరాబాద్ జియగూడ లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి సంబంధించినట్టు చెప్తూ అలాంటి వీడియోనే మరొకటి జనవరి 2020 లోనే పోస్ట్ చేసాడు.
కొన్ని కీ-వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా, ఆ అలంకరణ ని ‘వైకుంఠ ఏకాదశి 2020’ సందర్భంగా హైదరబాద్ లో చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ‘హెచ్ఎంటీవీ’ వారు టెలికాస్ట్ చేసిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ఆ అలంకరణ కి సంబంధించిన మరిన్ని వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కాబట్టి, పోస్ట్ చేసిన వీడియో అయోధ్య కి సంబంధించినది కాదు; హైదరబాద్ కి సంబంధించిన పాత వీడియో.
పోస్ట్ లోని వీడియో గురించి వెతకగా, ‘టీవీ9’ వారు కూడా ఆ లేజర్ షో వీడియో అయోధ్య లో భూమి పూజ సందర్భంగా తీసినట్టు పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసారని తెలిసింది.
కానీ, అదే వీడియో కనీసం ఏప్రిల్ 2019 నుండి ‘LASER LIGHT SHOW || RAMNAVAMI ||2019’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాంటి వీడియోనే మరొకటి ఒక యూసర్ యూట్యూబ్ లో 2019 లో అప్లోడ్ చేయగా, ఆ వీడియో గురించి ఒకరు కామెంట్స్ లో అడిగినప్పుడు, అది షహాద (మహారాష్త్ర) లో రామనవమి ర్యాలీ సందర్భంగా తీసినట్టు తెలిపాడు
కొన్ని కీ-వర్డ్స్ తో వెతకగా, ఒక మరాఠీ లోకల్ ఛానల్ కూడా 2019 లోనే ఆ లేజర్ షో షహాద (మహారాష్త్ర) లో రామనవమి ర్యాలీ కి సంబంధించినట్టు పోస్ట్ చేసిందని తెలుస్తుంది. కాబట్టి, ఈ వీడియో కూడా అయోధ్య కి సంబంధించింది కాదు.
అయితే, రామ మందిరం భూమి పూజ సందర్భంగా అయోధ్య లోని అనేక ప్రదేశాలను అలంకరించారని ‘ANI’ వారు రిపోర్ట్ చేసారు. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. భూమి పూజ కి సంబంధించిన దృశ్యాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, హైదరాబాద్ మరియు షహాద (మహారాష్త్ర) కి సంబంధించిన పాత వీడియోలను అయోధ్య రామ మందిరం భూమి పూజకి సంబంధించిన వీడియోలుగా షేర్ చేస్తున్నారు.