టోల్ గేట్ల దగ్గర ఇచ్చే రసీదు వెనకాల ఎమర్జెన్సీ సమయాల్లో ఫోన్ చేయడానికి నెంబర్లు ఉంటాయని, చాలా మందికి ఈ విషయం తెలీక రసీదు పడేసి కష్టాలు పడుతారని ఒక పోస్ట్ ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్: మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, టైర్ పంక్చర్ అయినప్పుడు మరియు పెట్రోల్ అయిపోయిప్పుడు సహాయం కోసం టోల్ రాసీదు వెనకాలున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందొచ్చు. కావున, టోల్ రసీదుని పడేయకండి.
ఫాక్ట్ (నిజం): టోల్ కట్టినా, కట్టకున్నా జాతీయ రహదారుల మీద ఎమర్జెన్సీ సమయాల్లో టోల్ రసీదు వెనకాల నెంబర్ కి కానీ, ‘1033’ హెల్ప్ లైన్ కి కానీ ఫోన్ చేయవొచ్చు. పెట్రోల్ అయిపోయినప్పుడు ఫోన్ చేస్తే, పెట్రోల్ తెచ్చి ఇస్తారని ఎక్కడా కూడా రాసిలేదు. జాతీయ రహదారుల మీద అందరికి వర్తించే సహాయాలను కేవలం టోల్ రాసిదు ఉంటేనే వర్తిస్తాయని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
టోల్ ప్లాజా నిర్వహణ:
జాతీయ రహదారుల పై టోల్ ప్లాజా సేకరించే టోల్ రేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. టోల్ ప్లాజాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అప్పగిస్తుంది. ప్రైవేటు సంస్థలు ఆ టోల్ ప్లాజాలను నడిపిస్తూ, ప్రజల దగ్గర నుండి టోల్ ని తీసుకుంటారు. దేశంలోని ప్రతి టోల్ ప్లాజా యొక్క వివరాలను ‘NHAI-TIS’ (National Highway Authority of India – Toll Information System) వెబ్ సైట్ లో చూడవొచ్చు. వివిధ రకాల టోల్ ప్లాజాలను మ్యాప్ మీద ఉన్న కలర్ కోడ్ సహాయంతో చూడవొచ్చు. ‘NHAI-TIS’ వెబ్ సైట్ పై మరింత సమాచారం కోసం ఇక్కడ చదవొచ్చు. వివిధ విధానాల టోల్ ప్లాజా మానేజ్మెంట్ గురుంచి తెల్సుకుందాం.

బీ.ఓ.టీ (BOT – Build Operate and Transfer): “బీ.ఓ.టీ (టోల్) విధానంలో ముందస్తు ఖర్చు మరియు నిర్వహణ ఖర్చులను ప్రైవేటు సంస్థలు భరిస్తాయి. తాము పెట్టిన ఖర్చు మరియు దాని వడ్డీని అగ్రిమెంట్ సహాయంతో టోల్ సేకరించి ప్రైవేటు సంస్థలు తీసుకుంటాయి.”
ఓ.ఎం.టీ (OMT – Operations Maintenance and Transfer): “ఈ విధానంలో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా ఎన్నికైన సంస్థకి టోల్ సేకరించే హక్కు ఉంటుంది. NHAI కి అగ్రిమెంట్ ప్రకరం కొంత డబ్బును చెల్లిస్తూ తాను టోల్ సేకరించిన దూరం మేరకు జాతీయ రహదారి యొక్క నిర్వాహణను ఆ సంస్థ చూసుకుంటుంది.”

టోల్ రసీదు మరియు టోల్ ప్లాజా ఇచ్చే సహాయం:
NHAI వెబ్ సైట్ లో ఉన్న కన్సెషన్ అగ్రిమెంట్లు చూస్తే, టోల్ ప్లాజా నిర్వహించే సంస్థ రహదారి పై కాపలా, అంబులెన్స్, టౌ ట్రక్ మరియు క్రేన్ సర్వీసులను అందించాలని ఉంటుంది.

టోల్ రసీదులు ఏ ఫార్మాట్ లో ఇవ్వాలో NHAI సూచించింది. రసీదు 8 సెంటీమీటర్ x 12 సెంటీమీటర్ ఉండాలి. NHAI మరియు టోల్ ప్లాజా ఆపరేటర్ యొక్క పేర్లు రసీదు పై ఉండాలి. ప్రజలకు అర్థమయ్యేలా రెండు లేదా మూడు బాషలలో, ప్రతి లైన్ ఒకే ఫాంట్ సైజు ఉండేలా ప్రింట్ చేయాలి. రసీదు మీద టోల్ ప్లాజా లొకేషన్, హెల్ప్ లైన్ నెంబర్, అంబులెన్సు ఫోన్ నెంబర్, క్రేన్ ఫోన్ నెంబర్ మరియు తదితర విషయలు ఉండాలి.

అగ్రిమెంట్లలో చెప్పినట్టు టోల్ రాసిదుల మీద సహాయం కోసం ఫోన్ నెంబర్లు ఉన్నాయో లేదో చూడడానికి కొన్ని టోల్ ప్లాజాల నుండి టోల్ రసీదులను FACTLY సేకరించింది. సేకరించిన అన్ని రసీదుల మీద హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి.

టోల్ రాసిదులపై హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి అనేది వాస్తవమే, కానీ పోస్ట్ లో చెప్పిన అన్ని సహాయాలు టోల్ ప్లాజా చేయదు. టోల్ ప్లాజా అంబులెన్సు సర్వీస్ అందిస్తుంది కానీ టైర్ పంక్చర్ మరియు పెట్రోల్ అయిపోయినప్పుడు సహాయం అందిస్తుందని ఎక్కడా కూడా రాసిలేదు. అగ్రిమెంట్లలో కూడా అలాంటి సహాయం టోల్ ప్లాజా అందించాలని ఎక్కడా లేదు. టోల్ ప్లాజా మేనేజర్లతో మాట్లాడడానికి FACTLY ప్రయత్నించింది, వారి దగ్గర నుండి సమాధానం వచ్చాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
అంతేకాదు, ‘1033’ హెల్ప్ లైన్ (జాతీయ రహదారి మీద ఎమర్జెన్సీ సమయాల్లో సహాయం కోసం IHMCL (Indian Highways Management Company Limited) మొదలు పెట్టిన హెల్ప్ లైన్) కి జాతీయ రహదారి ఉపయోగించే అందరు సహాయం కోసం ఫోన్ చేయవొచ్చు, కేవలం టోల్ కట్టిన్న వాళ్ళే కాదు. కావున, పోస్ట్ లో కేవలం టోల్ రసీదులు దగ్గర పెట్టుకోవడం వల్లే ఈ సహాయాలు పొందవచ్చని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు

చివరగా, జాతీయ రహదారులపై సహాయం పొందటానికి టోల్ రసీదు తప్పనిసరి కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: జాతీయ రహదారులపై సహాయం పొందటానికి టోల్ రసీదు తప్పనిసరి కాదు. - Fact Checking Tools | Factbase.us