“Indian Idol songs కాంపిటేషన్ లో నూ… జడ్జెస్ ను సైతం కన్నీళ్లు తెప్పించిన బాబా సాహెబ్ పాట”, అని చెప్తూ ఒక అతను బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి పాట పాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లయిమ్: ఇండియన్ ఐడల్‌లో బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి ఒక పాట పాడి జడ్జీలకు ఈ కంటెస్టెంట్ కన్నీళ్లు తెప్పించారు.
ఫాక్ట్(నిజం): ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో, ఇండియన్ ఐడల్ షోకి చెందిన ఫుటేజీని ఒక అతను పాట పాడుతున్న దృశ్యాలని కలిపి ఈ వీడియోని ఎడిట్ చేశారు. ఈ మధ్య ఇంటర్నెట్లో చాలా మంది ఇలా ఇండియన్ ఐడల్ ఫుటేజ్ ఉపయోగించి ఎడిట్ చేసిన వీడియోలు షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
మొదటగా, ఈ వీడియో ఇండియన్ ఐడల్ యొక్క ఏ ఎపిసొడ్‌లో, ఏ సీజన్లో వచ్చింది? ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియోలో ఉన్న ఫ్యూటేజ్, రెండు వేరు వేరు ఎపిసోడ్లకి చెందినది అని అర్థం అయ్యింది. అంతే కాక, ఈ ఎపిసోడ్లలో పాట పాడుతున్న కంటెస్టెంట్లు, వైరల్ వీడియోలో ఉన్న అతను వేరు.
వివరాల్లోకి వెళితే, ఇండియన్ ఐడల్ సీజన్ 12లోని ఈ రెండు ఎపిసోడ్లు (ఇక్కడ మరియు ఇక్కడ) సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ వారి అధికారిక యూట్యూబ్ చానల్‌లో ఉన్నాయి. వైరల్ వీడియోలో ఈ రెండు ఎపిసోడ్లలోని ఫ్యూటజీని కట్ చేసి వాడారు. వైరల్ వీడియోలో 0:08 దగ్గర వచ్చే దృశ్యాలని ఈ ఎపిసోడ్‌లో 2:43 దగ్గర నుండి చూడవచ్చు. అలాగే 3:08 దగ్గర వచ్చే దృశ్యాలని మీరు ఇండియన్ ఐడల్ యొక్క ఈ ఎపిసోడ్‌లో 0:25 దగ్గర నుండి చూడవచ్చు.
కింద ఉన్న రెండు gifsలో అసలు వీడియోకి వైరల్ అవుతున్న వీడియోకి మధ్య వ్యత్యాసాన్ని చూడచ్చు. అసలు వీడియోలో జడ్జి ఏడుస్తున్న ఫుటేజ్ తర్వాత ఇంకొక అతని షాట్ వస్తుంది. వైరల్ వీడియోలో, జడ్జి ఏడుస్తున్న ఫుటేజ్ తర్వాత వేరే షాట్ ఉంది (సింగర్ పాట పడుతున్న షాట్)
అసలు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి యొక్క వివరాల కోసం ఇంకోసారి ఇంటర్నెట్ కీ వర్డ్స్ సెర్చ్ చేస్తే, ఈ వీడియో “Rk Super Dancer” అనే వెరిఫైడ్ యూట్యూబ్ చానల్‌లో దొరికింది. ఈ చానల్‌లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ).
ఇండియన్ ఐడల్ ఫుటేజీ ఉపయోగించి ఇలా ఎడిట్ చేసిన వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి, ఇది వరకు కూడా ఇలాంటి ఒక వీడియో వైరల్ అయితే దాని మీద ఒక కథనాన్ని ఫ్యాక్టలి ప్రచురించింది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, ఈ వైరల్ వీడియో ఎడిట్ చెయ్యబడింది. ఇండియన్ ఐడల్ ఎపిసోడ్‌లో ప్రసారమైన వీడియో కాదు.