Fake News, Telugu
 

2024లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తోందని తమిళ నటుడు సూర్య వ్యాఖ్యానించినట్టుగా షేర్ చేస్తున్న ఈ కథనాన్ని ‘Way2News’ పబ్లిష్ చేయలేదు

0

2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టవచ్చని తమిళ నటుడు సూర్య ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని చెప్పినట్టు ‘Way2News’ కథనం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టవచ్చని తమిళ నటుడు సూర్య అభిప్రాయపడినట్టుగా ‘Way2News’ వార్తా కథనం.

ఫాక్ట్ (నిజం): 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందని తమిళ నటుడు సూర్య ఇటీవల ఎక్కడా వ్యాఖ్యానించలేదు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ కథనాన్ని తమ సంస్థ పబ్లిష్ చేయలేదని, అది పూర్తిగా ఫేక్ వార్తా అని ‘Way2News’ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలుపుతున్నట్టు తమిళ నటుడు సూర్య ఇటీవల ఏదైనా కార్యక్రమంలో 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందోని వ్యాఖ్యలు చేశారా, అని కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, సూర్య అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఇటీవల ఏ ఒక్క వార్తా సంస్థ ఆర్టికల్ లేదా వీడియో రిపోర్ట్ పబ్లిష్ చేయలేదని తెలిసింది. ఒకవేళ సూర్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసేవి.

తెలుగు దేశం పార్టీకి సంబంధించి గానీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించి గానీ సూర్య తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో ఎటువంటి పోస్ట్ లేదా ట్వీట్ పెట్టలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తా కథనాన్ని తమ సంస్థ పబ్లిష్ చేయలేదని, తమ ఫార్మాట్‌ను ఉపయోగించి కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని తమ పేరుతో వైరల్ చేస్తున్నారని Way2News’ పోర్టల్ ట్వీట్ ద్వారా స్పష్టతనిచ్చింది.

చివరగా, 2024లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తోందని తమిళ నటుడు సూర్య వ్యాఖ్యానించినట్టుగా షేర్ చేస్తున్న ఈ కథనాన్ని ‘Way2News’ పబ్లిష్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll