Fake News, Telugu
 

బేగంపేట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించలేదు

0

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా భేటీ అయినట్లు, రేవంత్ రెడ్డితో బ్రదర్ అనిల్ కూడా ఉన్నట్లు తెలిసింది అని ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బేగంపేట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు రిపోర్ట్ చేసిన ‘Way2News’ వార్తా కథనం.

ఫాక్ట్(నిజం): గతంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎల్.రమణ మరియు రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోని ఎడిట్ చేస్తూ ఈ వైరల్ ఫోటోను రూపొందించారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ  అయినట్లు విశ్వసనీయమైన రిపోర్ట్స్ ఏమి లభించలేదు. అంతేకాకుండా, ఈ వార్తను ఖండిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ. మహేశ్ కుమార్ గౌడ్ ఈ వార్తను ప్రచురించిన నమస్తే తెలంగాణ పత్రికపై బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అలాగే, ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో తెలుపుతున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా భేటీ అయ్యారా? అని వెతికితే, వారి సమావేశానికి సంబంధించిన విశ్వసనీయమైన రిపోర్ట్స్ ఏమి లభించలేదు. ఈ క్రమంలోనే నమస్తే తెలంగాణ పత్రిక టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా భేటీ అయినట్లు “ గురుశిష్యల రహస్య భేటి.. !” అనే శీర్షికతో 09 మార్చి 2024న వార్త కథనం ప్రచురించగా, ఈ వార్తలను ఖండిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ. మహేశ్ కుమార్ గౌడ్ 09 మార్చి 2024న బేగంపేట పోలీసులకు నమస్తే తెలంగాణ ఎడిటర్, పబ్లిషర్ మరియు యాజమాన్యం పైన ఫిర్యాదు చేశారని తెలిసింది. అలాగే, 07 మార్చి 2024న బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు, రేవంత్‌ల మధ్య రహస్య భేటీ జరిగినట్లు వచ్చిన వార్త పూర్తిగా కల్పితమని మహేష్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేసిన వార్తాకథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

అలాగే Way2News వార్త కథనంలోని ఫోటో ఎడిట్ చేయబడినది అని తెలుస్తుంది. గతంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి దిగిన ఫోటోను ఎడిట్ చేస్తు ఈ వైరల్ ఫోటోను రూపొందించారు. అసలైన ఫోటోలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎల్.రమణ మరియు రేవంత్ రెడ్డి ఉండగా, ఎల్.రమణ ఫోటోని బ్రదర్ అనిల్ ఫోటోతో ఎడిట్ చేస్తు ఈ వైరల్ ఫోటోను రూపొందించారు. అయితే, ఈ ఫోటో ఎప్పుడు తీశారో తెలియలేదు.

అంతేకాకుండా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/84vdyb) ద్వారా ‘Way2News’లో వెతికితే “BIG BREAKING: సుప్రీంకోర్టు సంచలన తీర్పు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.

చివరగా, బేగంపేట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారంటూ చెప్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll