ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల అనంతరం TDP అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని అన్నట్టు రిపోర్ట్ చేసిన Way2News రిపోర్ట్ చేసినట్టు ఒక క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు – Way2News కథనం.
ఫాక్ట్(నిజం): ఎన్నికల అనంతరం తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు అనలేదు. ఈ Way2News క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేసింది. ఇదే విషయం Way2News కూడా స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడాడు. ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం వెతికే క్రమంలో ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడిన క్లిప్ మాకు కనిపించింది.
చంద్రబాబు మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరు బాధ్యతగా మంచి భవిష్యత్ కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని’ కోరారు. అలాగే టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘100శాతం’ అంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. కాగా ఎన్నికల అనంతరం తమ కూటమి గెలవడం కష్టం అని చంద్రబాబు అన్నట్టు మాకు ఎలాంటి రిపోర్ట్స్ దొరకలేదు.
ప్రస్తుతం షేర్ అవుతున్న Way2News క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేసింది. ఈ క్లిప్‌కు సంబంధించిన సమాచారం కోసం వెతకగా Way2News తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ క్లిప్‌ను తాము పబ్లిష్ చేయలేదని స్పష్టం చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఇది ఫేక్ క్లిప్ అని, తమ లోగోను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని Way2News స్పష్టం చేసింది.
సాధారణంగా Way2News తమ న్యూస్ క్లిప్‌లలో ఆ వార్తకు సంబంధించిన ఒక వెబ్ లింక్‌ను కూడా అందిస్తుంది. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో అందించిన లింక్ అడ్రస్‌తో వెతకగా ఇది గతంలో స్కూల్ పిల్లలకు అందించే పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబందించిందని తెలిసింది.

చివరగా, ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నట్టు Way2News పేరుతో షేర్ అవుతున్నది ఫేక్ న్యూస్ క్లిప్.