ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయంలో ఢిల్లీ సీఎం, AAP అధినేత కేజ్రీవాల్ పీఏ కొట్టాడు అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనికి మద్దతుగా కొందరు మహిళలు, పురుషులు గొడవ పడుతూ కొట్టుకుంటున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయంలో AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ కొడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో జరిగిన ఘర్షణకు సంబంధించినవి. అయితే పలు రిపోర్ట్స్ ప్రకారం 13 మే 2024న ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో ఆయనను కలిసేందుకు AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వేచి ఉన్న సమయంలో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ మలివాల్‌తో అనుచితంగా ప్రవర్తించాడు అని తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
13 మే 2024 ఉదయం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పలు మీడియా రిపోర్ట్స్ పేర్కొన్నాయి. 16 మే 2024న పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు Xలో పోస్ట్ చేసింది. 14 మే 2024న AAP ఎంపీ సంజయ్ సింగ్ ఒక పత్రిక ప్రకటనలో 13 మే 2024న ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసంలో ఆయనను కలిసేందుకు AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వేచి ఉన్న సమయంలో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ మలివాల్‌తో అనుచితంగా ప్రవర్తించాడు అని, ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దృష్టికి వచ్చిందని, తగిన చర్యలు తీసుకుంటామని సంజయ్ సింగ్ మీడియాకు తెలిపారు.(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ)
తదుపరి మేము ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తెలుసుకునేందుకు వీడియో యొక్క కీఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇదే వీడియోను షేర్ చేస్తూ పలువురు సోషల్ మీడియా యూజర్స్ ఈ ఘటన మే 13న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మధ్యవర్తిత్వ గదిలో జరిగినట్లు పేర్కొన్నారు.(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ)(ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). అలాగే ‘లోక్‌మాట్ టైమ్స్’ అనే మీడియా సంస్థ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ ఘటన ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మధ్యవర్తిత్వ గదిలో జరిగినట్లు పేర్కొంది.
ఈ వీడియో తీస్ హజారీ మధ్యవర్తిత్వ కేంద్రంలో జరిగిన ఘర్షణకు సంబంధిచినది అని తీస్ హజారీ కోర్ట్ న్యాయవాదులు మరియు కోర్టు విలేకరులు ‘ది క్వింట్‘కి ధృవీకరించారు.
అలాగే మేము యూట్యూబ్‌లో తీస్ హజారీ మధ్యవర్తిత్వ కేంద్రంకి సంబంధించిన వీడియో ఒకటి కనుగొని, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను, తీస్ హజారీ మధ్యవర్తిత్వ కేంద్రం దృశ్యాలతో పోల్చి చూడగా, వైరల్ వీడియోలోని గది యొక్క దృశ్యాలు, తీస్ హజారీ మధ్యవర్తిత్వ కేంద్రం దృశ్యాలు ఓకే విధంగా ఉండటం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో జరిగిన ఘర్షణకు మనం సంబంధించినవి అని నిర్థారించవచ్చు.
చివరగా, ఢిల్లీ సీఎం నివాసంలో AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు చేసిన దాడికి సంబంధించిన వీడియో అంటూ సంబంధంలేని వీడియోను షేర్ చేస్తున్నారు.