Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో జూన్ 2015లో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో చైనా ప్రతినిధి బృందం నిర్వహించిన సమావేశానికి సంబంధించినది

0

31 ఆగస్టు 2025, 01 సెప్టెంబర్ 2025 చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) దేశాధినేతల 25వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా, 31 ఆగస్టు 2025న, భారత ప్రధాని నరేంద్ర మోదీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల (2004-2014) పాలనలో, సోనియా గాంధీ ప్రధానమంత్రి స్థానంలో విదేశీ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారంటూ అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల (2004-2014) పాలనలో, సోనియా గాంధీ ప్రధానమంత్రి స్థానంలో విదేశీ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ సమావేశం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో (2004-2014) జరగలేదు. ఈ వీడియో జూన్ 2015 నాటిది. ఈ వైరల్ వీడియో 16 జూన్ 2015న అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో చైనా పార్లమెంటరీ ప్రతినిధి బృందం నిర్వహించిన సమావేశానికి సంబంధించినది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ 16 జూన్ 2015న “చైనా ప్రతినిధి బృందంతో కాంగ్రెస్ అధ్యక్షురాలి సమావేశం (Congress President Meeting with Chinese Delegation)” అనే శీర్షికతో  షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో జూన్ 2015లో  అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చైనా ప్రతినిధి బృందం నిర్వహించిన సమావేశానికి సంబంధించినది అని తెలుస్తుంది.

దీని ఆధారంగా ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సమావేశాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రచురించబడిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). 16 జూన్ 2015న న్యూఢిల్లీలోని తన నివాసంలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆఫ్ చైనా స్టాండింగ్ కమిటీ చైర్మన్ జాంగ్ డెజియాంగ్‌తో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో సమావేశమయ్యారు. ఈ కథనాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను కలవడానికి ముందు జాంగ్ డెజియాంగ్ అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీలను కూడా కలిశారని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.

జూన్ 2015లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆఫ్ చైనా స్టాండింగ్ కమిటీ చైర్మన్ జాంగ్ డెజియాంగ్ భారత పర్యటనకు సంబంధించి భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.

గతంలో కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో, సోనియా గాంధీ ప్రధానమంత్రి స్థానంలో విదేశీ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారంటూ పలు దృశ్యాలు వైరల్ కాగా, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియో జూన్ 2015లో సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో చైనా పార్లమెంటరీ ప్రతినిధి బృందం నిర్వహించిన సమావేశానికి సంబంధించినది. ఈ సమావేశం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll