Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో 14 మే 2025న గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన తిరంగా యాత్రకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది, బలోచిస్తాన్‌కు సంబంధం లేదు

0

పాకిస్తాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్ అయిన బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడుతున్నట్లు 09 మే 2025న బలోచిస్తాన్ వేర్పాటువాద ప్రతినిధి, రచయిత, జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్తగా చెప్పుకున్న మీర్ యార్ బలోచ్ Xలో పోస్టు చేశారు. బలోచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి, భారత్, ఇతర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. బలోచిస్తాన్లో ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం కూలిపోతుందని, ఆ స్థానంలో స్వతంత్ర బలోచిస్తాన్ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. అయితే, బలోచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ భారత్, ఐక్యరాజ్య సమితి ఎక్కడా అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఈ నేపథ్యంలో, “ఆపరేషన్ సింధూర్ ఇచ్చిన ధైర్యంతో,పాకిస్తాన్ నుండి విడిపోయి, బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారిన సందర్భంగా, కృతజ్ఞతతో మన భారతదేశ జాతీయ పతకాన్ని ఎగురవేస్తూ, భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తూన్న దృశ్యాలు”  అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) అలాగే, ఈ వీడియో బలోచిస్తాన్‌కి సంబంధించినదా? కాదా? అని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి.  ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బలోచిస్తాన్‌లో అక్కడి బలూచ్ ప్రజలు మన భారత జాతీయ జెండాను ఎగురవేసి భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు, పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. 14 మే 2025న భారతదేశం పాకిస్తాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ విజయాన్ని పురస్కరించుకుని, భారత సైనికులకు సంఘీభావంగా గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన తిరంగా యాత్రకు సంబంధించిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా, ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న పలు దుకాణాలపై గుజరాతీ భాషలో పేర్లు ఉండటం, అలాగే అలాగే వీడియోలో కనిపిస్తున్న బ్యాండ్ డ్రమ్స్‌పై ‘SAIFEE SCOUT SURAT’ అని రాసి ఉండటం మనం చూడవచ్చు.

తదుపరి, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ‘’BhaveshSays2.0′ అనే యూజర్ 17 మే 2025న యూట్యూబ్‌లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియో గుజరాత్‌లోని సూరత్‌లో బోహ్రా ముస్లింలు తిరంగా యాత్రలో పాల్గొన్న దృశ్యాలను చూపిస్తుంది. వైరల్ వీడియోలోని దృశ్యాలు షేర్ చేస్తూ ఈ దృశ్యాలు గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన తిరంగా యాత్రకు సంబంధించినవి అంటూ పలువురు సోషల్ మీడియాలో పేర్కొన్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా,భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై విజయవంతంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంఘీభావంగా,14 మే 2025న, గుజరాత్‌లోని సూరత్‌లో భాగల్ చౌరస్తా నుండి చౌక్ బజార్ కిల్లా వరకు,  తిరంగా యాత్ర నిర్వహించినట్లు తెలిసింది. ఈ తిరంగా యాత్రకు సంబంధించిన వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ యాత్రలో బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు, కేంద్ర జలశక్తి మంత్రి C.R.పాటిల్ పాల్గొన్నారు (ఇక్కడ, ఇక్కడ).

అలాగే మేము వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్‌లో జియోలొకేట్ చేశాము. వైరల్ వీడియోలో కనిపిస్తుంది గుజరాత్‌లోని సూరత్‌లో భాగల్ ప్రాంతం.  దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో 14 మే 2025న గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన తిరంగా యాత్రకు సంబంధించినది అని మనం నిర్థారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 14 మే 2025న గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన తిరంగా యాత్రకు సంబంధించినవి, బలోచిస్తాన్‌కు సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll