Fake News, Telugu
 

మాస్క్ ధరించకుండా బయట తిరుగుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న ఈ వీడియో ఉజ్జైన్ కి సంబంధించింది, ఢిల్లీకి కాదు.

0

ఢిల్లీలో మాస్క్ ధరించని వాళ్ళకి 10 గంటలు జైలు శిక్ష విదిస్తున్నారని చెప్తూ దీనికి సంబంధించిన వీడియో ఒకటి షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పద్దతిని ముంబై, హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలలో కూడా అమలు చేస్తారని కూడా ఈ పోస్టు ద్వారా చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీలో మాస్క్ ధరించని వాళ్ళకి 10 గంటలు జైలు శిక్ష విదిస్తున్నారు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని సంఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో జరిగింది. ఉజ్జైన్ లో మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారిని అరెస్ట్ చేసి పది గంటలు జైల్లో పెట్టారు. వీడియోలో పోలీస్ వాహనంపై మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ గమనించొచ్చు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ కొన్ని వార్తా కథనాలు మరియు న్యూస్ వీడియోస్ కూడా ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో ఉన్న వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే వీడియోలో కనిపించే పోలీస్ వాహనంపై మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ గమనించవొచ్చు. దిని ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇవే విజువల్స్ ప్రచురించిన ఒక మధ్యప్రదేశ్ లోకల్ న్యూస్ వీడియో కనిపించింది. ఈ న్యూస్ వీడియో ప్రకారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో మాస్క్ ధరించకుండ బయట తిరుగుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పది గంటల పాటు ఓపెన్ జైల్స్ లో పెడుతున్నారు. ఈ న్యూస్ వీడియో లో ASP అమరేంద్ర సిన్హా కూడా ఇదే విషయం చెప్పడం చూడొచ్చు, కాకపోతే ఈ వీడియో ASP మాస్క్ లేని వారిని ఎన్ని గంటలు జైల్లో పెడుతున్నారో చెప్పలేదు.

గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో ఉన్న ఘటనకి సంబంధించిన వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనంలో కూడా ఈ వీడియో ఉజ్జైన్ లో మాస్క్ ధరించకుండ బైట తిరుగుతున్న వారిని పోలీసులు పది గంటల పాటు జైల్లో పెడుతున్న ఘటనకి సంబంధించిందని తెలిపారు. ఇదే విషయం చేప్తున్న మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా ఈ వీడియో మధ్యప్రదేశ్ కి సంబంధించిందని, ఈ వీడియోకి ఢిల్లీకి ఎటువంటి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఐతే ఉజ్జైన్ లోగాని, మధ్యప్రదేశ్ లో గాని మాస్క్ ధరించకుండ బైటికి వచ్చిన వారిని అరెస్ట్ చేస్తారన్న గవర్నమెంట్ ఆర్డర్ కాని, వార్తా కథనాలుగాని ఏవి మాకు లభించలేదు. ఇంకా ఢిల్లీ లేదా ఇతర రాష్ట్రాల్లో గాని ఇలాంటి రూల్ తీసుకవస్తున్నట్టు ఎలాంటి గవర్నమెంట్ ఆర్డర్ కాని, వార్తా కథనాలుగాని మాకు లభించలేదు.

ఐతే ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పెట్టించే వార్తాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.  

చివరగా, ఈ వీడియో మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ కి సంబంధించింది, ఢిల్లీకి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll