Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2025లో చైనాలో జరిగిన మాగ్‌లెవ్ రైలు టెస్ట్ రన్‌కు సంబంధించినది కాదు; ఇది జపాన్‌కు సంబంధించిన ఒక పాత వీడియో

0

చైనా 2 సెకన్లలోనే 700 kmph వేగాన్ని అందుకునే రైలును ఇటీవల పరీక్షించింది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఈ మాగ్‌లెవ్ మోడల్  రూపొందించినట్లు చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ వెల్లడించింది. దీని బరువు దాదాపు టన్ను వరకు ఉందని తెలిపింది. 400 మీటర్ల (1,310-అడుగులు) మ్యాగ్లెవ్ ట్రాక్ పై దీన్ని పరీక్షించినట్లు చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రొఫెసర్ లి జీ తెలిపారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

ఈ నేపథ్యంలో, ఒక హైస్పీడ్ రైలు కొన్ని సెకన్లలో బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా, సమీపంలోని మరో బ్రిడ్జి పై ఉన్న కొంతమంది దాని వేగాన్ని చూసి ఆశ్చర్యపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇది ఇటీవల చైనా నిర్వహించిన మాగ్‌లెవ్ పరీక్షను చూపిస్తున్నట్లు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనా ఇటీవలి (డిసెంబర్ 2025లో )  నిర్వహించిన మాగ్‌లెవ్ రైలు టెస్ట్ రన్‌కు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో చైనా ఇటీవలి (డిసెంబర్ 2025) మాగ్‌లెవ్ రైలు టెస్ట్ రన్‌ కు సంబంధించింది కాదు. ఈ దృశ్యాలు నవంబర్ 2024లో జపాన్‌లో జరిగిన 500 కి.మీ/గం మాగ్లెవ్ (లీనియర్ మోటార్) రైలు యొక్క టెస్ట్ రన్‌కు సంబంధించినవి. రైలు వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి జపాన్‌కు చెందిన నిప్పాన్ టెలివిజన్ న్యూస్‌లో అనౌన్సర్ అయిన డైసుకే ఫుజిటా. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న పలు సోషల్ మీడియా పోస్ట్‌లను కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). 25 డిసెంబర్ 2025న చైనా మాగ్‌లెవ్ పరీక్ష నిర్వహించక ముందే ఈ పోస్ట్‌లు ఇంటర్నెట్‌లో ఉన్నాయని మేము తెలుసుకున్నాము. ఈ పోస్ట్ వివరణలో ఈ దృశ్యాలు జపాన్‌కు సంబంధించినవని కొంత మంది పేర్కొన్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఇదే వీడియో యొక్క ఎక్స్‌టెండెడ్ వెర్షన్ 09 నవంబర్ 2024న నిప్పాన్ టెలివిజన్ రైల్వే డిపార్ట్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించబడిందని మేము కనుగొన్నాము. ఈ దృశ్యాలు జపాన్‌లో 500 కి.మీ/గం మాగ్‌లెవ్ (లీనియర్ మోటార్) రైలు యొక్క టెస్ట్ రన్‌కు సంబంధించినవని మేము తెలుసుకున్నాము.

రైలు వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి జపాన్‌కు చెందిన నిప్పాన్ టెలివిజన్ న్యూస్‌లో అనౌన్సర్‌గా పనిచేస్తున్న డైసుకే ఫుజిటా అని మేము తెలుసుకున్నాము. నవంబర్ 2024లో జపాన్‌లో జరిగిన ఈ 500 కి.మీ/గం మాగ్లెవ్ (లీనియర్ మోటార్) రైలు టెస్ట్ రన్ ఫోటోలను డైసుకే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కూడా షేర్ చేశాడు.

చివరిగా, ఈ వైరల్ వీడియో డిసెంబర్ 2025లో చైనాలో జరిగిన మాగ్‌లెవ్ రైలు టెస్ట్ రన్‌కు సంబంధించినది కాదు; ఇది జపాన్‌కు సంబంధించిన ఒక పాత వీడియో. 

Share.

About Author

Comments are closed.

scroll