ఇటీవల కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, JD(S) హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకి సంబధించినవిగా చెప్తున్న పలు అశ్లీల వీడియోలు బయటికి రావడంతో JD(S) పార్టీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే, ఈ కన్నడ సెక్స్ స్కామ్ కు నారా లోకేశ్‌కి సంబంధం ఉందని, ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణతో లోకేశ్‌కి సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్తూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ ఫోటోలో ప్రజ్వల్ రేవణ్ణ, నారా లోకేశ్ ఒకే సోఫాలో కూర్చొని ఉండటం మనం చూడవచ్చు. ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ “కన్నడ సెక్స్ స్కామ్‌లో నారా లోకేశ్” అనే శీర్షికతో ఆన్‌లైన్ తెలుగు ‘దిశ’ పత్రిక కథనమంటూ ఒక పేపర్ క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “కన్నడ సెక్స్ స్కామ్‌లో నారా లోకేశ్” – ‘దిశ’ వార్త కథనం.
ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘దిశ’ ప్రచురించలేదు. ఈ వైరల్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫేక్ అని ‘దిశ’ సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పష్టత ఇచ్చింది. అలాగే ఇదే విషయాన్ని దిశ తమ ఏపీ 5PM డైనమిక్ ఎడిషన్ లో కూడా ప్రచురించింది. అలాగే ఈ వైరల్ క్లిప్పింగ్లో ఉపయోగించిన నారా లోకేశ్, ప్రజ్వల్ రేవణ్ణ కలిసి ఉన్నట్లు చూపిస్తున్న ఫోటో, రెండు వేర్వేరు ఫోటోలను జోడిస్తూ మార్ఫింగ్ చేయబడింది. డిసెంబర్ 2022లో బెంగళూరులో KGF ఫేం కన్నడ స్టార్ హీరో యష్ ని నారా లోకేశ్ కలిసినప్పుడు తీసిన ఫోటోను, అలాగే 29 మార్చి 2024న ప్రజ్వల్ రేవణ్ణ మల్లేశ్వరం నియోజకవర్గం బీజేపీ MLA, కర్ణాటక మాజీ ఉప-ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు తీసిన ఫోటోను మార్ఫింగ్ చేస్తూ ఈ వైరల్ ఫోటో రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో తెలుపుతున్నట్టు ఇటీవల కర్ణాటకలో బయటికి వచ్చిన సెక్స్ స్కాముకు నారా లోకేశ్‌కి సంబంధం ఉందా? అనే విషయాన్ని గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, వైరల్ పోస్టులో చెప్పినట్లు కన్నడ సెక్స్ స్కాముకు నారా లోకేశ్‌కి సంబంధం ఉందని చెప్పే ఎలాంటి రిపోర్ట్స్, ప్రజ్వల్ రేవణ్ణను లోకేశ్ గతంలో కలిసినట్లు కూడా ఎలాంటి లభించలేదు. పైగా ఈ వార్త దిశా సంస్థ ప్రచురించలేదు అని తెలిసింది. వైరల్ పేపర్ క్లిప్పింగ్‌ని జాగ్రత్తగా గమనిస్తే దిశ పత్రిక ఈ వార్తను 01 మే 2024న పబ్లిష్ చేసినట్లు చెప్తుంది. దీని ఆధారంగా, దిశ వెబ్‌సైట్‌లో 01 మే 2024న ఆ సంస్థ పబ్లిష్ చేసిన వివిధ న్యూస్ ఎడిషన్లు పరిశీలించగా, ఇలాంటి వార్త ఏదీ దిశ ప్రచురించలేదు అని తెలిసింది. అయితే దిశ పబ్లిష్ చేసిన ఆంధ్రప్రదేశ్ 2PM డైనమిక్ ఎడిషన్ మార్ఫింగ్ చేస్తూ ఈ వైరల్ న్యూస్ క్లిప్పింగ్ రూపొందించారని మేము గుర్తించుము. వైరల్ న్యూస్ క్లిప్పింగ్ మరియు దిశ సంస్థ ప్రచురించిన అసలైన వార్త పత్రికను క్రింద చూడవచ్చు.
అలాగే ఈ ఫేక్ దిశ క్లిప్పింగ్ వైరల్ అవడంతో, దిశ సంస్థ X(ట్విట్టర్)లో ఈ పేపర్ క్లిప్పింగ్ ఫేక్ అని స్పష్టత ఇచ్చింది, అలాగే అసలైన వార్త కథనాన్ని కూడా షేర్ చేసింది. ఇదే విషయాన్ని దిశ ఆంధ్రప్రదేశ్ 5PM డైనమిక్ ఎడిషన్ లో పబ్లిష్ చేసింది.
అ తర్వాత ఈ వార్త కథనంలో ఉపయోగించిన వైరల్ ఫోటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోలో కనిపిస్తున్న నారా లోకేశ్ ఫోటో ఆయన డిసెంబర్ 2022లో బెంగళూరులో KGF ఫేం కన్నడ స్టార్ హీరో యష్ ని కలిసినప్పుడు తీసిన ఫోటోగా తెలిసింది(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) (ఆర్కైవ్ లింక్). అలాగే ఈ వైరల్ ఫోటోలో కనిపిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణకి సంబంధించిన ఫోటో కోసం వెతకగా, ఇదే ఫోటోను ప్రజ్వల్ రేవణ్ణ తన అధికారిక ఇంస్టాగ్రామ్(ఆర్కైవ్ లింక్) పేజీలో 29 మార్చి 2024న షేర్ చేశారు అని తెలిసింది. ఈ ఫోటో ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణ మల్లేశ్వరం నియోజకవర్గం బీజేపీ MLA, కర్ణాటక మాజీ ఉప-ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు తీసింది. ఇదే ఫోటోను అశ్వత్ నారాయణ కూడా తన ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో రెండు వేర్వేరు ఫోటోలను జోడిస్తూ ఎడిట్ చేస్తూ రూపొందించారు అని నిర్థారించవచ్చు.
చివరగా, నారా లోకేశ్, ప్రజ్వల్ రేవణ్ణ కలిసి ఉన్న ఈ వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది, అలాగే కన్నడ సెక్స్ స్కామ్ లో నారా లోకేశ్ అని చెప్తున్న ఈ ‘దిశ’ వార్తా కథనం కూడా ఫేక్.