Fake News, Telugu
 

ఈ వైరల్ స్క్రిప్టెడ్ వీడియోకు శ్రీపెరంబుదూర్ వద్ద ఇటీవల తవ్వకాల్లో దొరికిన పురాతన నటరాజ విగ్రహానికి ఎలాంటి సంబంధం లేదు

0

ఇటీవల మార్చి 2024లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో 1000 సంవత్సరాల పైగా పురాతనమైన నటరాజ మూర్తి విగ్రహం దొరికింది అని చెప్తూ పలు పోస్ట్‌లు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్‌లతో పాటు, నటరాజ విగ్రహం వెలికితీతకు సంబంధించిన దృశ్యాలను చూపించే వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరో పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మార్చి 2024లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో పురాతన నటరాజ విగ్రహం వెలికితీస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): పలు వార్తా కథనాల ప్రకారం, శ్రీపెరంబుదూర్ సమీపంలోని శివన్ కూడల్ గ్రామంలోని శివ కులుండేశ్వర్ ఆలయ ప్రాంగణంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో మార్చి 2024లో పురాతన నటరాజ విగ్రహం కనుగొనబడింది. అయితే ఈ వైరల్ వీడియోకు త్రవ్వకాల్లో దొరికిన పురాతన నటరాజ విగ్రహానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో స్క్రిప్ట్ చేయబడింది. ఈ వైరల్ వీడియోను’KRB YT VLOG’ అనే యూట్యూబ్ ఛానెల్‌ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసింది. ఈ ఛానెల్ అనేక స్క్రిప్టెడ్ వీడియోలను రూపొందించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్టులో చెప్పినట్లు, తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఇటీవల ఏదైనా పురాతన నటరాజ విగ్రహం దొరికిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 20 మార్చి 2024న ‘PuthiyathalaimuraiTV’ అనే తమిళ న్యూస్ ఛానల్ యూట్యూబ్‌లో “పురాతన ఐంబన్ నటరాజ విగ్రహం ఆవిష్కరణ | కాంచీపురం | PTT” అనే శీర్షికతో అప్‌లోడ్ చేసిన న్యూస్ బులెటిన్ వీడియో ఒకటి లభించిది. (తమిళం నుండి తెలుగులోకి అనువదించగా). ఈ వీడియో ప్రకారం, “శ్రీపెరంబుదూర్‌కు సమీపంలోని శివన్‌ కూడల్‌ గ్రామంలోని శివ కులుండేశ్వర ఆలయం ఉంది. వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం తమిళనాడులోని పురాతనమైనది.  ఆలయ ప్రాంగణంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుండగా,ఈ త్రవ్వకాలలో వారికి ఒక త్రిశూలం మరియు పురాతన నటరాజ విగ్రహం ఒకటి లభించిది. అధికారులు ఈ నటరాజ విగ్రహం వేల సంవత్సరాల నాటిదని, పంచలోహాలతో కూడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విగ్రహం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి విగ్రహాన్ని తనిఖీ కోసం చెన్నైకి పంపారు.”

ఇదే విషయాన్ని తెలుపుతున్న మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ వార్త కథనాల వీడియోలను జాగ్రత్తగా పరిశీలిస్తే, శ్రీపెరంబుదూర్‌లో వెలికితీసిన నటరాజ విగ్రహం వైరల్ వీడియోలో ఉన్న దానికి భిన్నంగా ఉందని స్పష్టమవుతుంది. వార్త కథనాలలో చూపించిన విగ్రహం విరిగి ఉండగా, వైరల్ వీడియోలోని విగ్రహం చెక్కుచెదరకుండా ఉంది. దీన్ని బట్టి వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలకు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఇటీవల దొరికిన నటరాజ విగ్రహానికి సంబంధం లేదని నిర్ధారించవచ్చు.

ఈ వైరల్ వీడియో గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, మేము పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యాలను చూపిస్తున్న ఎక్కువ నిడివి గల వీడియోని ‘KRB YT VLOG‘ అనే యూట్యూబ్ ఛానెల్‌ 28 మార్చి 2024న పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ పూర్తి నిడివి గల వీడియో జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియో స్క్రిప్ట్ చేయబడినట్లు కనిపిస్తుంది. అలాగే ఈ యూట్యూబ్ ఛానెల్‌లోని ఇతర వీడియోలు పరిశీలించగా, ఈ ఛానల్ చాలా వరకు భూతాలు, దయ్యాలు, అతీంద్రియ శక్తులకు సంబంధించిన అనేక స్క్రిప్ట్ వీడియోలు అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఛానెల్ ద్వారా అప్‌లోడ్ చేయబడిన కొన్ని స్క్రిప్ట్ వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి వైరల్ వీడియో స్క్రిప్ట్ చేయబడిందని నిర్ధారించవచ్చు.

చివరగా, మార్చి 2024లో శ్రీపెరంబుదూర్‌లో పురాతన నటరాజ విగ్రహం కనుగొనబడింది, అయితే ఈ వైరల్ వీడియోకు త్రవ్వకాల్లో దొరికిన పురాతన నటరాజ విగ్రహానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో స్క్రిప్ట్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll