సోనియా గాంధీ సిగరెట్ తాగుతున్నట్టు ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పేద మహిళలకు ప్రతి నెల 8500 రూపాయలు అందిస్తామని ఇచ్చిన హామీని వ్యంగ్యంగా ఈ ఫోటోకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ ఫొటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: సోనియా గాంధీ సిగరెట్ తాగుతున్నట్టు ఉన్న ఫోటో.
ఫాక్ట్(నిజం): సోనియా గాంధీ సిగరెట్ తాగుతున్నట్టు ఉన్న ఈ ఫోటోను ‘Remaker’ అనే ఒక AI టూల్ ద్వారా ఎడిట్ చేసి రూపొందించారు. Tumblrలో ఉన్న ఒక ఫోటోను ఈ టూల్ ద్వారా ఎడిట్ చేసి సోనియా గాంధీ ముఖాన్ని అతికించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇప్పుడు షేర్ అవుతున్న ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 26 ఫిబ్రవరి 2013న ‘Tumblr’లో అప్లోడ్ చేసిన దీని ఒరిజినల్ ఫోటో మాకు కనిపించింది. ఒక్క ముఖం తప్ప ఈ ఫోటో ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో రెండు ఒకేలా ఉన్నాయి. ‘Ghazale Photographed by Farzad Sarfarazi, 2012′ అనే కాప్షన్‌తో ఈ ఫోటోను అప్లోడ్ చేసారు.

Tumblrలోని ఈ ఫోటోని గతంలో చాల మంది ‘Farzad Sarfarazi’ తీసినట్టు క్రెడిట్స్ ఇస్తూ షేర్ చేశారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).
ఈ నేపథ్యంలోనే వెతకగా ప్రస్తుతం షేర్ అవుతున్న లాంటిదే సోనియా గాంధీ సిగరెట్ తాగుతున్న మరో ఫోటో దొరికింది. ఐతే ఈ ఫొటోపై కింద ఎడమవైపు ‘Remaker’ అనే వాటర్ మార్క్ ఉంది. దీని ఆధారంగా వెతకగా ‘Remaker’ అనేది ఒక AI ఎడిటింగ్ టూల్ అని తెలిసింది. దీని ద్వారా ఒకరి ఫోటోను ఎడిట్ చేసి వేరొకరి ముఖం అతికించొచ్చు. దీన్నిబట్టి ఈ సోనియా గాంధీ ఫోటోను కూడా ‘Tumblr’లో ఉన్న ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేసి సోనియా గాంధీ ముఖాన్ని అతికించినట్టు అనుకోవచ్చు.

చివరగా, సోనియా గాంధీ సిగరెట్ తాగుతున్నట్టు చూపిస్తున్న ఈ ఫోటోను AI టూల్ ద్వారా రూపొందించారు.