Fake News, Telugu
 

ఈ వీడియో జపాన్ రెస్టారెంట్లలో ఉపయోగించే ఆహార ప్రతిరూపాల తయారీని చూపిస్తున్నది

0

మనం తినే క్యాబేజీని కృత్రిమంగా తయారు చేస్తున్నారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా కృత్రిమ (నకిలీ) క్యాబేజీని తయారు చేస్తున్న దృశ్యాలను చూపించే వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కృత్రిమ(నకిలీ) క్యాబేజీ తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు జపాన్‌లో ఉపయోగించే మైనపుతో తయారు చేసే ఆహార నమూనాలను (ప్రతిరూపాలను) తయారు చేయడాన్ని చూపిస్తున్నది. ఈ కృత్రిమ క్యాబేజీలు ఆహారంగా వినియోగించరు, వీటిని జపాన్‌లోని రెస్టారెంట్‌ల వద్ద ప్రదర్శిస్తారు. దీని వల్ల ఆహారం కోసం వచ్చే కస్టమర్స్ వారు ఆర్డర్ చేసే పదార్థాలు వాస్తవంగా ఎలా ఉంటుందో చూడగలరు. జపాన్ ఆహార పరిశ్రమలో ఇటువంటి కృత్రిమ ఆహార నమూనాలను (ప్రతిరూపాలను) ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియో వాస్తవానికి కృత్రిమ క్యాబేజీ తయారీని చూపిస్తుంది. అయితే, ఈ కృత్రిమ క్యాబేజీలు ఆహారంగా వినియోగం కోసం తయారుచేయడం లేదు, వీటిని జపాన్‌లోని రెస్టారెంట్‌ల వద్ద ఆహార నమూనాల (ప్రతిరూపాలు)గా ఉపయోగిస్తారు.

ఈ వీడియోకి సంబంధించిన సంచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న ఎక్కువ నిడివి గల వీడియోను ‘macdeetube’ అనే యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి 2014న షేర్ చేసింది. ఈ వీడియో యొక్క వివరణ పరిశీలించగా, “ఈ వీడియో జపాన్‌లోని గిఫు ప్రిఫెక్చర్‌లోని రెస్టారెంట్‌లలో  ఉపయోగించే మాంసాలు, కూరగాయల ప్రతిరూపాలను మరియు వారి అందించే మెనూలోని ఆహార పదార్థాల యొక్క అల్ట్రా-రియలిస్టిక్ (అత్యంత సహజంగా మరియు వాస్తవికంగా కనిపించే)  ప్రతిరూపాలు తయారుచేయడాన్ని చూపిస్తుంది.”

ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ కృత్రిమ ఆహార ప్రతిరూపాలను తయారుచేయడం గురించి రిపోర్ట్ చేసిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ & ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం ‘షోకుహిన్ శాంపిల్’ లేదా ‘ఫుడ్ శాంపిల్’ అని పిలవబడే ఈ సహజంగా మరియు వాస్తవికంగా కనిపించే ఆహార పదార్థాల యొక్క ప్రతిరూపాలను జపాన్‌లోని రెస్టారెంట్‌ల వద్ద ప్రదర్శిస్తారు. దీని వల్ల ఆహారం కోసం వచ్చే కస్టమర్స్ వారు ఆర్డర్ చేసే పదార్థాలు వాస్తవంగా ఎలా ఉంటుందో చూడగలరు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో జపాన్ రెస్టారెంట్ లలో ఉపయోగించే ఆహార నమూనా తయారీకి సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది అని నిర్ధారించవచ్చు.

గతంలో కూడా ఇలాంటి కృత్రిమ క్యాబేజీని తయారు చేస్తున్న దృశ్యాలను చూపించే వీడియోలను షేర్ చేస్తూ చైనా సింథటిక్ (నకిలీ) క్యాబేజీలను అమెరికన్ మార్కెట్లకు పంపుతుంది అంటూ పోస్టులు వైరల్‌గా మారగా, ఫాక్ట్-చెకింగ్ సంస్థ స్నోప్స్ (Snopes), ఈ వాదనన తప్పు అని నిర్థారించింది. అంతేకాకుండా,  వైరల్ వీడియోలోని దృశ్యాలు జపనీస్ మైనపు ఆహార నమూనాలను చూపిస్తున్నట్లు స్పష్టం చేశారు.

చివరగా, ఈ వీడియో జపాన్ రెస్టారెంట్లలో ఉపయోగించే ఆహార ప్రతిరూపాల తయారీని చూపిస్తున్నది, ఈ కృత్రిమ క్యాబేజీలను ఆహారంగా వినియోగించరు.

Share.

About Author

Comments are closed.

scroll