Fake News, Telugu
 

సిలికాన్ బొమ్మల ఫోటోలని యాదాద్రి భూవనగిరి జిల్లాలో పంది కడుపున మనిషి జన్మించిన చిత్రాలంటూ షేర్ చేస్తున్నారు

0

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఒక పంది కడుపున మనిషి జన్మించాడు, అంటూ కొన్ని ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.    

క్లెయిమ్: యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరారెడ్డిపల్లి గ్రామంలో పంది కడుపున మనిషి జన్మించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలలో కనిపిస్తున్నది సిలికాన్‌తో రూపొందించిన శిశువు బొమ్మలు. ఇటలీకి చెందిన లైరా మగానుకో అనే ఒక ఆర్టిస్ట్‌ ఈ సిలికాన్ బొమ్మలని రూపొందించారు. ఈ ఫోటోలలో కనిపిస్తున్నది నిజమైన శిశువు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని ‘Bizarre Crew’ అనే వెబ్సైట్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. లైరా మాగనుకో రూపొందించిన ‘బేబీ హైబ్రిడ్ పిగ్’ యొక్క చిత్రాలంటూ ఈ ఫోటోల వివరణలలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ఫోటోలను లైరా మగానుకో 2018 జులై నెలలో తన ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలలో షేర్ చేసినట్టు తెలిసింది. మిశ్రమ సిలికాన్ పదార్ధాలను ఉపయోగించి రూపొందించిన ‘బేబీ హైబ్రిడ్ సిలికాన్ పిగ్ పీస్’ ఫోటోలంటూ లైరా మగానుకో తన ఫేస్‌బుక్ పోస్టు వివరణలో తెలిపారు.  

ఇటలీకి చెందిన ఆర్టిస్ట్ లైరా మగానుకో, హైపర్-రేయలిస్టిక్ సిలికాన్ బొమ్మలను తయారుచేసి వివిధ ఈ-కామర్స్ వెబ్సైటులలో తన బొమ్మలని అమ్ముతుంటారు. లైరా మగానుకో తయారుచేసిన మరికొన్ని సిలికాన్ బొమ్మలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఇదివరకు, లైరా మగానుకో తయారు చేసిన మరికొన్ని సిలికాన్ బొమ్మల ఫోటోలని గుజరాత్, రాజస్థాన్ మరియు బీహార్ రాష్ట్రాలలో తిరుగుతున్న వింత జంతువు దృశ్యాలంటూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఇటలీ ఆర్టిస్ట్ లైరా మగానుకో తయారుచేసిన సిలికాన్ బొమ్మల ఫోటోలని యాదాద్రి భూవనగిరి జిల్లాలో పంది కడుపున మనిషి జన్మించిన చిత్రాలంటూ షేర్ చేస్తున్నారు.       

Share.

About Author

Comments are closed.

scroll