Fake News, Telugu
 

కర్ణాటక బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న వీడియోని తెలంగాణకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

09 డిసెంబర్ 2023న తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద తెలంగాణలోని మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో, ఈ పథకం ప్రవేశపెట్టాక బస్సులో తెలంగాణ మహిళలు గొడవపడుతున్నారని చెప్తూ, ఇద్దరు మహిళలు ఒకరినొకరు కొట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత బస్సులో ఇద్దరు మహిళలు గొడవపడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ ఘటన KSRTC బస్సులో జరిగినట్లు కన్నడ మీడియా సంస్థలు జులై 2023లోనే రిపోర్ట్ చేశాయి. పైగా, 09 డిసెంబర్ 2023 నాటి నుంచి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని జులై 2023 నుంచి అనేక కన్నడ వార్తా సంస్థలు ప్రసారం చేసినట్లు గమనించాం.

మీడియా కథనాల ప్రకారం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 జూన్ 2023 నాటి నుంచి శక్తి పథకాన్ని అమలుచేశారు. ఇందులో భాగంగా ఆర్డినరీ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నేపధ్యంలో KSRTC బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న వీడియో అంటూ ఈ వీడియోని గురించి అక్కడి మీడియా సంస్థలు జులై 2023లో రిపోర్ట్ చేశాయి. పైగా, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని 09 డిసెంబర్ 2023న ప్రారంభించారు. పై ఆధారాలను బట్టి ఈ వీడియో తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించిన తర్వాత జరగలేదని స్పష్టమవుతుంది.

చివరిగా, కర్ణాటక బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న వీడియోని తెలంగాణకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll