Fake News, Telugu
 

భజరంగ్ దళ్ కార్యకర్త బురఖాలో తిరుగుతూ పోలీసులకు దొరికాడంటూ పాకిస్తాన్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తున్నారు

0

బొంబాయిలో బుర్కా వేసుకొని బజారులో తిరుగుతున్న భజరంగ్ దళ్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకోని కౌన్సలింగ్ ఇచ్చి పంపించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: బొంబాయిలో బుర్కా వేసుకొని బజారులో తిరుగుతున్న భజరంగ్ దళ్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగింది. ఒక వ్యక్తి బురఖా ధరించి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించగా పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. ఈ వీడియోతో ముంబైకి గానీ, భజరంగ్ దళ్ కి గానీ ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక వ్యక్తి బురఖా ధరించి పోలీసులకు దొరికిపోయిన విషయం నిజమే అయినప్పటికీ ఈ ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ ఈ వీడియోను షేర్ చేసిన ట్వీట్ మాకు కనిపించింది.

ఈ బురఖా ధరించిన వ్యక్తిని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి దగ్గర అరెస్ట్ చేసినట్టు ఆ జర్నలిస్ట్ తెలిపింది. ఆ వ్యక్తి ఎందుకు బురఖాలో ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడో ఇంకా తెలియరాలేదని ఈ వీడియోను రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ).

ఆలాగే వీడియోలో ‘Capital City Police’ అని ఒక లోగో కనిపిస్తుంది. దీని ఆధారంగా వెతకగా ఈ లోగో లాహోర్ పోలీసులదని తెలిసింది. దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నట్టు ఈ ఘటన ముంబైలో జరగలేదని మరియు వీడియోలోని వ్యక్తి భజరంగ్ దళ్ కార్యకర్త కాదని స్పష్టమవుతుంది.

చివరగా, భజరంగ్ దళ్ కార్యకర్త బురఖాలో తిరుగుతూ పోలీసులకు దొరికాడంటూ పాకిస్తాన్‌కి సంబంధించిన వీడియో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll