Fake News, Telugu
 

మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాతి దృశ్యాలంటూ షేర్ చేస్తున్న ఈ రెండు ఫోటోలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసినవే

0

మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాక ముందు, వచ్చిన తరువాతి చిత్రాలంటూ సోషల్ మీడియాలో రెండు ఫోటోలను షేర్ చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రం బీజేపీ ప్రభుత్వం వచ్చాక మంటలలో కాలిపోతుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాతి దృశ్యాలను చూపిస్తున్న చిత్రాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన రెండు ఫోటోలు, మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తీసిన చిత్రాలనే చూపిస్తున్నాయి. పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటోని 2019లో దీపంజన్ ఘోష్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. 2017 మార్చి నెల నుండి బీజేపీ మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫోటో 1:

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని 2019 నవంబర్ నెలలో దీపంజన్ ఘోష్ అనే ఫొటోగ్రాఫర్ ‘విక్కీమీడియా కామన్స్’ వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. సంధ్యా సమయంలో (సాయంకాలం) మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరం యొక్క చిత్రమంటూ దీపంజన్ ఘోష్ ఈ ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు. ఈ ఫోటోని దీపంజన్ ఘోష్ 03 నవంబర్ 2019 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో కూడా షేర్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ 2017 మార్చి నెల నుండి అధికారంలో ఉంది.   

ఫోటో 2:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ 2023 మే నెలలో ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మణిపూర్ రాష్ట్రంలో ‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాకాండ దృశ్యామని ఈ ఫోటోని షేర్ చేస్తూ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ అనేక వార్తా సంస్థలు కూడా 2023 మే నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన రెండు ఫోటోలు మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసిన చిత్రాలని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాతి దృశ్యాలంటూ షేర్ చేసిన ఈ రెండు చిత్రాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తీశారు.

Share.

About Author

Comments are closed.

scroll