ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ఈ వరదల కారణంగా ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇంకా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో ఇరుక్కున్న తొమ్మిది మందిని జేసీబీ ఆపరేటర్ సుభాన్ ధైర్యంగా రక్షించినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, “ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని జేసీబీ ఆపరేటర్ సుభాన్ కాపాడుతున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని జేసీబీ ఆపరేటర్ సుభాన్ కాపాడుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని సుభాన్ అనే జేసీబీ ఆపరేటర్ ధైర్యంగా తన జేసీబీతో వంతెనపైకి వెళ్ళి రక్షించిన మాట నిజమే. అయితే, ఈ వీడియోలోని దృశ్యాలు ఈ సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2024లో సౌదీ అరేబియాలోని అసిర్ ప్రావిన్స్‌లోని బిషా ప్రాంతంలో వరదలో చిక్కుకున్న కొంతమంది యువకులను అయద్ బిన్ దగాష్ అల్ అక్లాబి అనే వ్యక్తి తన బుల్డోజర్‌తో రక్షించించే దృశ్యాలను చూపుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఖమ్మంలోని ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని సుభాన్ అనే జేసీబీ ఆపరేటర్ ధైర్యంగా తన జేసీబీతో వంతెనపైకి వెళ్ళి రక్షించిన మాట వాస్తవమే (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అయితే, ఈ వైరల్ వీడియో సుభాన్ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించించే దృశ్యాలను చూపించడం లేదు.
ఇకపోతే, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 28 ఏప్రిల్ 2024న గల్ఫ్ న్యూస్ (Gulf News) అనే వార్త సంస్థ పబ్లిష్ చేసిన వార్త కథనం ఒకటి లభించింది. ఈ వార్త కథనం వైరల్ వీడియోలోని దృశ్యాలనే చూపిస్తున్న ఫోటోను కూడా పబ్లిష్ చేసింది. ఈ కథనం ప్రకారం, ఈ వైరల్ వీడియో సౌదీ అరేబియాలోని అసిర్ ప్రావిన్స్‌లోని బిషా ప్రాంతంలో వరదలో చిక్కుకున్న కొంతమంది యువకులను అయద్ బిన్ దగాష్ అల్ అక్లాబి అనే వ్యక్తి తన బుల్డోజర్‌తో రక్షించిచే దృశ్యాలను చూపుతుంది. ఈ ఘటనకు సంబంధించి వైరల్ వీడియోలోని దృశ్యాలతో కూడిన మరిన్ని వార్తాకథనాల ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఖమ్మం ప్రకాష్ నగర్ వంతెనపై వరదల్లో చిక్కుకున్న 9 మందిని జేసీబీ ఆపరేటర్ సుభాన్ కాపాడుతున్న దృశ్యాలు అంటూ సౌదీ అరేబియాకు చెందిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.