Fake News, Telugu
 

రైతులపైకి ట్రాక్టర్ దూసుకొచ్చిన ఈ ఘటన అమ్రిత్‌సర్ లో జరిగింది, ఉత్తర ప్రదేశ్ లో కాదు

0

కొందరు మహిళలపై ట్రాక్టర్ ఎక్కుతున్న వీడియో షేర్ చేసి, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల పై వాటర్ టాంకర్ ఎక్కించి చంపుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆందోళనలు చేస్తున్న రైతులపైకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాటర్ టాంకర్ ఎక్కించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో అమ్రిత్‌సర్ లోని వల్లహ్ ప్రాంతంలో ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులకు సంఘిభావంగా నిర్వహించబోయే నిరసన కార్యక్రమాలకు వెళ్తున్నవారి పైకి ఒక వాటర్ టాంకర్ దూసుకొచ్చిన ఘటనకి సంబంధించింది. ఈ ఘటనకి సంబంధించి చాలా వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని వీడియోకి సంబంధించి గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులోని వీడియోలో కనిపించిన ట్రాక్టర్ ని పోలినే ఫోటో ప్రచురించిన ఒక ప్రాంతీయ వార్తా కథనం మాకు కనిపించింది. 26 జనవరి 2021న ప్రచురింపబడ్డ ఈ కథనం ప్రకారం ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులకు సంఘిభావంగా అమ్రిత్‌సర్ లోని వల్లహ్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాలకు వెళ్తున్న కొందరిపై అదుపుతప్పిన ఒక వాటర్ టాంకర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు.

పైన తెలిపిన వార్తా కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనపై NDTV ప్రచురించిన వార్తా కథనం మాకు కనిపించింది. ఈ వార్తా కథనం ‘ఢిల్లీ రైతుల నిరసనలకు మద్దతుగా నిరసన కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళుతున్న బృందాన్ని వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో బృందంలోని ఇద్దరు మరణించారు మరియు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులను పిలిచారు. మేము దర్యాప్తు ప్రారంభించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాము’  వల్లహ్ పోలీస్ స్టేషన్ SHO సంజీవ్ కుమార్ తెలిపినట్టు ఈ వార్తా కథనంలో ప్రచురించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఈ కథనం ద్వారా అర్ధమవుతుంది.

ఈ ఘటనకి సంబంధించి ANI ప్రచురించిన వార్తా కథనం కూడా ఈ ఘటన అమ్రిత్‌సర్ లోని వల్లహ్ ప్రాంతంలో జరిగినట్టు దృవీకరిస్తుంది. వీటన్నిటి ఆధారంగా పోస్టులోని వీడియోలోని ఘటన అమ్రిత్‌సర్ లో జరిగినట్టు, ఈ ఘటనకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

చివరగా, రైతులపైకి ట్రాక్టర్ దూసుకొచ్చిన ఈ ఘటన అమ్రిత్‌సర్ లో జరిగింది, ఉత్తర ప్రదేశ్ లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll