Fake News, Telugu
 

2017లో రాజస్థాన్‌లో ముస్లింలు నిర్వహించిన నిరసన వీడియోని ముస్లింలు మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చినట్టు ఇప్పుడు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న చేతక్ సర్కిల్ వద్ద కొందరు ముస్లింలు మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చి, ‘అల్లా హు అక్బర్’ అని నినాదించారని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్:  ఉదయ్‌పూర్‌లోని చేతక్ సర్కిల్ వద్ద కొందరు ముస్లింలు మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చి, మతపరమైన నినాదాలు చేసిన వీడియో. 

ఫాక్ట్(నిజం): వీడియోలో సంఘటన నిజమైనదే అయినా, ఇది సుమారు ఐదున్నర సంవత్సరాల క్రితం జరిగింది. డిసెంబర్ 2017లో మొహమ్మద్ అఫ్రాజుల్ అనే వలస కార్మికుడిని రాజస్థాన్‌లోని రాజసమంద్‌లో శంబులాల్ రేగార్ అనే వ్యక్తి హత్య చేసాడు. దీనికి నిరసనగా కొందరు ముస్లింలు ఉదయ్‌పూర్‌లోని చేతక్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసన సందర్బంగా మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చారనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియో గురించి మరింత సమాచారం పొందడానికి సంబంధిత కీ-వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలని పోలి ఉన్న దృశ్యాలతో, డిసెంబర్ 2017లో India TV అప్లోడ్ చేసిన ఒక న్యూస్ రిపోర్టు లభించింది. ఈ రిపోర్టు ప్రకారం, 2017లో శంబులాల్ రేగార్ అనే వ్యక్తి రాజస్థాన్‌లోని రాజసమంద్‌లో మొహమ్మద్ అఫ్రాజుల్ అనే వలస కార్మికుడిని హత్య చేసాడు (ఇక్కడ, ఇక్కడ). శంబులాల్ ఈ హత్య యొక్క వీడియోను చిత్రీకరించి, అందులో ‘లవ్ జిహాద్’ కి విరుద్ధంగా బెదిరింపు వ్యాఖలు చేసాడు.

ఈ హత్యకి నిరసన వ్యక్త పరుస్తూ కొందరు ముస్లింలు ఉదయ్‌పూర్‌లోని చేతక్ సర్కిల్ వద్ద ఒక ర్యాలీని నిర్వహించారు (ఇక్కడ , ఇక్కడ).  ‘అల్లా హు అక్బర్’ అంటూ పలు రకాల నినాదాలు కూడా చేసారు. ఈ నిరసనలో భాగంగా మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చినట్టు ఈ సంఘటనపై ప్రచురించబడిన ఏ వార్త కథనాల్లో కూడా ప్రస్తావించలేదు.

ఈ ర్యాలీకి చెందిన మరొక వీడియోని ఇక్కడ చూడవచ్చు. వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు ఈ విడియోలోవే.

ఇదిలా ఉంచితే, ఇదే వీడియో ట్విట్టర్లో ఒక యూసర్ 12 జూన్ నాడు పోస్టు చెయ్యగా, ఉదయ్‌పూర్‌ పోలీస్ ఈ వీడియో ఒక పాత సంఘటనకి చెందినదని సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని వారు చెప్పారు. 

చివరిగా, 2017లో రాజస్థాన్‌లో ముస్లింలు నిర్వహించి ఒక నిరసనకు చెందిన వీడియో ఇప్పటిది అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll