Fake News, Telugu
 

ఆర్టికల్ 370ను ఉపసంహరించిన సందర్భంలో మోదీని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి ఎం.ఎస్. బిట్టా కాంగ్రెస్ పార్టీలో లేరు

0

‘మోడీ చేసే మంచి మీకు కనిపించకుంటే మీరసలు భారతీయుడే కాదు’ అని కాంగ్రెస్ నేత ఎం.ఎస్. బిట్టా వ్యాఖ్యానించాడంటూ ఒక వీడియోని షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ‘మోడీ చేసే మంచి మీకు కనిపించకుంటే మీరసలు భారతీయుడే కాదు’ – కాంగ్రెస్ నేత ఎం.ఎస్. బిట్టా

ఫాక్ట్(నిజం): 2019లో మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను ఉపసంహరించిన నేపథ్యంలో ఒక జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ ఎం.ఎస్. బిట్టా ఈ వ్యాఖ్యలు చేసాడు. ఐతే ఆ సమయానికి బిట్టా కాంగ్రెస్ పార్టీలో లేరు. గతంలో అయన ఇండియన్ యూత్ కాంగ్రెస్ చైర్మన్‌గా మరియు కాంగ్రెస్ మంత్రిగా చేసినప్పటికీ, అయన చాలా సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ (AIATF) ఛైర్మన్ ఎం.ఎస్. బిట్టా ఈ వ్యాఖ్యలు 2019లో చేసాడు. మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను ఉపసంహరించిన నేపథ్యంలో ఒక జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేసాడు. ఐతే ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు.

2019లో ఈ వీడియోను రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు కూడా ఆయనను మాజీ కాంగ్రెస్ నేతగానే సంబోధించాయి. ఎం.ఎస్. బిట్టా ఒక్కప్పుడు ఇండియన్ యూత్ కాంగ్రెస్ లీడర్‌గా మరియు పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసినప్పటికీ, చాలా రోజులనుండి అయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

గతంలో బిట్టా అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసాడు, దీనికి సంబంధించిన ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. అలాగే 2014లో మోదీ మొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పటి నుండి అనేక సందర్భాలలో  మోదీని పొగుడుతూ వస్తున్నాడు (ఇక్కడ మరియు ఇక్కడ).

ఐతే ఈ వీడియోను ఇటీవల కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఐతే పైన చెప్పినట్టు బిట్టా ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి కాంగ్రెస్ పార్టీలో లేరు.

చివరగా, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను ఉపసంహరించిన సందర్భంలో మోదీని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి ఎం.ఎస్. బిట్టా కాంగ్రెస్ పార్టీలో లేరు.

Share.

About Author

Comments are closed.

scroll