ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ “అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద ఒక యాక్ట్ చేయడమే దానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు” అని అన్నట్లు వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి అని చెప్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 04 మే 2024న హిందూపురంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలను విమర్శిస్తూ, ఈ యాక్ట్ అంటే ఏంటో అక్కడ ఉన్న ప్రజలకి వివరించారు. వాస్తవంగా, వై.ఎస్. జగన్ మాట్లాడుతూ “అయ్యా అసలు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా చంద్రబాబు, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియో గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోను 04 మే 2024న సాక్షి టీవీ (Sakshi TV live) తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో “CM YS Jagan Responded On AP Land Titling Act At Hindupur YSRCP Election Campaign Public Meeting” అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురంలో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించినది అని తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు టైంస్టాంప్ 02:03 వద్ద మొదలై, టైంస్టాంప్ 02:17 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, ఈ ప్రచార సభలో ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “అయ్యా అసలు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా చంద్రబాబు, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో” అని అన్నారు. దీన్ని బట్టి అసలు వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకో అని చంద్రబాబును విమర్శిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో అక్కడ ఉన్న ప్రజలకి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మరింత సమాచారం కోసం FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మాట్లాడుతున్న ఈ వీడియో ఎడిట్ చేయబడింది.