“ప్రపంచ ప్రధాన మంత్రుల భేటీలో మన మోదీ గారు ఎక్కడ కూర్చున్నారు దట్ ఇస్ మోదీ జీ” అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో భారత ప్రధాని మోదీ సమావేశం మధ్యలో కూర్చున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రపంచ ప్రధాన మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తూ భారత ప్రధాని మోదీ అధ్యక్ష కుర్చీలో కూర్చున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో మోదీతో పాటు ఉన్నది వివిధ దేశాల ప్రధానులు కాదు. ఈ వైరల్ వీడియో 22 సెప్టెంబర్ 2024న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో MIT (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నిర్వహించిన పలు టెక్ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొన్న దృశ్యాలను చూపిస్తుంది. ఈ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ సహా అమెరికాకు చెందిన 15 ప్రముఖ కంపెనీల సీఈవోలు హాజరయ్యారు. క్వాడ్ (QUAD) సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 2024లో ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లారు. 21 సెప్టెంబర్ 2024న అమెరికాలోని డెలావేర్ నగరంలో జరిగిన 4వ క్వాడ్(QUAD) సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, వీడియోలో మనం ఈ సమావేశానికి సంబంధించిన బ్యానర్‌ను చూడవచ్చు. ఆ బ్యానర్‌పై “MIT School of Engineering Tech CEOs Roundtable Prime Minister Shri Narendra Modi, New York, September 22, 2024” అని రాసి ఉండటం మనం గమనించవచ్చు.
దీని ఆధారంగా ఈ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలను కలిగిన అధిక నిడివి గల వీడియోను 23 సెప్టెంబర్ 2024న, “ప్రధానమంత్రి కార్యాలయం (PMO INDIA)” యొక్క అధికారక యుట్యూబ్ ఛానల్ షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో 22 సెప్టెంబర్ 2024న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో, MIT(మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్) నిర్వహించిన పలు టెక్ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న దృశ్యాలను చూపిస్తుంది.
ఈ సమావేశానికి సంబంధించి భారత విదేశాంగ మంత్రితవ్వ శాఖ విడుదల చేసిన ప్రకటనను ఇక్కడ చూడవచ్చు. ఈ సమావేశానికి సంబంధించి ప్రధాని మోదీ తన యొక్క అధికారిక X (ట్విట్టర్)లో చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ సమావేశానికి సంబంధించిన పలు వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం, ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ మరియు ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వంటి ప్రముఖులతో సహా అమెరికాకు చెందిన 15 ప్రముఖ కంపెనీల సీఈవోలు హాజరయ్యారు.
క్వాడ్(QUAD) సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 2024లో ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లారు (ఇక్కడ). 21 సెప్టెంబర్ 2024 నుండి 23 సెప్టెంబర్ 2024 వరకు మూడు రోజులు మోదీ అమెరికాలో పర్యటించి QUAD సదస్సు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) నిర్వహించిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ మొదలైన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు (ఇక్కడ). 21 సెప్టెంబర్ 2024న అమెరికాలోని డెలావేర్ నగరంలో జరిగిన 4వ క్వాడ్(QUAD) సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియో మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు (ఇక్కడ).
చివరగా, ఈ వైరల్ వీడియో 22 సెప్టెంబర్ 2024న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో MIT నిర్వహించిన పలు టెక్ కంపెనీల CEOల రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న దృశ్యాలను చూపిస్తుంది.