ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్య గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. “విద్య ప్రభుత్వ బాధ్యత కాదు… కార్పోరేట్‌లే ఆ బాధ్యత తీసుకోవాలి” అని ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు అన్నట్టు తెలుస్తుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: “విద్య ప్రభుత్వ బాధ్యత కాదు… కార్పోరేట్‌లే ఆ బాధ్యత తీసుకోవాలి” అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఫాక్ట్(నిజం): 2015లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ విద్య అనేది ఒక్క ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, దాతలు కూడా ముందుకు వచ్చి పనిచేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి వక్రీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో యొక్క ఒరిజినల్ ఫూటేజ్ పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు కార్పోరేట్‌లు విద్య భాద్యత తీసుకోవాలని కోరినప్పటికీ, ఈ ఉపన్యాసంలో ఎక్కడ కూడా విద్య ప్రభుత్వ బాధ్యత కాదని ఆయన అనలేదు. ప్రస్తుతం షేర్ అవుతున్నది డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియో.
ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన పూర్తి ఫూటేజ్ లభించింది. యూట్యూబ్ వివరణ ప్రకారం 05 సెప్టెంబర్ 2015 నాడు ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆంధ్రా యూనివర్సిటీలో ఈ ప్రసంగం చేసారు.

ఐతే ఈ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు విద్యకు సంబంధించి సానుకూల దృక్పథంతోనే మాట్లాడారు. ప్రభుత్వ సహకారం ఉంటుందనే అయన చెప్తూ వచ్చారు. ఐతే ఈ ప్రసంగంలో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘విద్య అనేది ఒక్క ప్రభుత్వ బాధ్యత కాదు…ప్రభుత్వం చేయాలి…దాతలు ముందుకు రావాలి…మీరు కూడా మీ భుజస్కంధాలపైన ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెంచే భాద్యత తీసుకుంటే…సజావుగా జరుగుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఐతే ఈ వ్యాఖ్యల ప్రారంభంలో అయన వాడిన ‘ఒక్క’ అనే పదాన్ని తీసేసి ‘విద్య అనేది ఒక్క ప్రభుత్వ బాధ్యత కాదు’ అని అయన అన్నట్టు డిజిటల్‌గా ఎడిట్ చేసారు. దీన్నిబట్టి వైరల్ పోస్టులో చంద్రబాబుకు ఆపాదిస్తున్న వ్యాఖ్యలు ఆయన చేయలేదని స్పష్టమవుతుంది.
చివరగా, ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాదు’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నట్టు ఉన్న ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది.