Fake News, Telugu
 

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వ ఇటీవల నిర్ణయం తీసుకోలేదు, ఆ హోదా కోసం ఏప్రిల్ 2023లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పటి వీడియో ఇది

0

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలనాత్మక రాజ్యాంగపరమైన నిర్ణయం తీసుకుందని చెప్తూ, ఒక టైమ్స్ నౌ వారి వీడియో రిపోర్టు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దళిత క్రైస్తవులకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఎస్సీ హోదా కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించి టైమ్స్ నౌ వారి వీడియో రిపోర్ట్. 

ఫ్యాక్ట్(నిజం): 19 ఏప్రిల్ 2023న దళితులుగా ఉండి క్రైస్తవంలోకి మారిన వారికి రిజర్వేషన్‌తో సహా చట్టబద్ధమైన రక్షణ, హక్కులు, ఇంకా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు టైమ్స్ నౌ వారు ప్రసారం చేసిన వార్తా కథనం ఇది. వైరల్ క్లెయిములో చెప్తున్నట్లు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానిది కాదు. ఈ విషయమై సుప్రీం కోర్టులో అనేక రిట్ పిటిషన్‌లు ప్రస్తుతం పెండింగులో ఉన్నాయి. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి ఇటీవల తమిళనాడు ప్రభుత్వం దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పిస్తూ ఏదైనా నిర్ణయం తీసుకుందా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెప్తున్న ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. 

వైరల్ అవుతున్న టైమ్స్ నౌ వారి వీడియో రిపోర్టును మేము సరిగ్గా చూడగా, అందులో రిపోర్టర్ ఇంకా యాంకర్ మాట్లాడుతూ షెడ్యూల్ క్యాస్ట్/కులాల(SC) వారికి వచ్చే రిజర్వేషన్ ఇంకా అనేక ప్రయోజనాలు క్రైస్తవంలోకి మారిన దళితులకి కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని తీసుకుందని అన్నారు. 

దీన్ని ఆధారంగా తీసుకొని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ రిపోర్టు యొక్క పూర్తి వెర్షన్ మాకు ‘The Economic Times’ వారి యూట్యూబ్ ఛానల్‌లో లభించింది. ఇది 19 ఏప్రిల్ 2023 నాటి వీడియో.

 ‘క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులాల సభ్యులకు రిజర్వేషన్లు సహా చట్టబద్ధమైన రక్షణ, హక్కులు మరియు రాయితీలను విస్తరించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని బుధవారం తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది.,’ అని ఈ వీడియో యొక్క వివరణంలో ఉంది (ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేశాము).

ఒక కీవర్డ్ సెర్చ్ ద్వారా ఈ విషయానికి సంబంధించిన అనేక ఏప్రిల్ 2023 నాటి వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఒక 2023 నాటి వీడియోను తప్పుడు కథనంతో ఇప్పుడు షేర్ చేస్తున్నారని మనకు స్పష్టం అవుతుంది. 

సుప్రీం కోర్టులో పెండింగ్ పిటిషన్‌లు

క్రైస్తవం ఇంకా ఇస్లాం మతాల్లోకి మారిన దళితులకు (షెడ్యూల్ కులాల వారికి) SC రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు ప్రస్తుతం పెండిగులో ఉన్నాయి. వీటిలో Writ petetion (C) 180/2004 ఒకటి. 2004లో సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే NGO ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో వేసింది. ఈ పిటిషన్లు Constitution (SC) Order, 1950లోని (రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆదేశం, 1950 ) మూడో పెరాను ఉద్దేశించి చేసినవి. ఈ ఆర్డర్ ఇంకా దాని 1956 సవరణ ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలను పాటించే వారిని మాత్రమే షెడ్యూల్ కులాలగా పరిగణించబడుతుంది (ఇక్కడ, ఇక్కడ). 

జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్

ఈ పిటిషన్ తర్వాత, ఈ విషయంపై తమ సిఫార్సులు ఇవ్వమని భారత ప్రభుత్వం జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్‌ను కోరింది (ఇక్కడ, ఇక్కడ). రంగనాథ్ మిశ్రా కమిషన్ తమ 2007 రిపోర్టులో దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు SC రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది

2022లో కొత్త కమిషన్

దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు SC హోదా ఇచ్చే అంశంపై తమ నిర్ణయాన్ని మూడు వారాల్లోపు తెలపాలని ఆగస్ట్ 2022లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ విషయాన్ని పరిశీలించడానికి, అక్టోబర్ 2022లో కేంద్ర ప్రభుత్వం భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను నియమించింది (ఇక్కడ, ఇక్కడ). 

జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టులో చేసిన సిఫార్సులను తిరస్కరిస్తూ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు SC రిజర్వేషన్లు వర్తించవని నవంబర్ 2022లో భారత ప్రభుత్వం ఒక అఫిడేవిట్ ద్వారా సుప్రీం కోర్టుకు తెలిపింది(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

2025 డిసెంబర్ నాటికి ఈ పిటిషన్లు ఇంకా సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని విచారణ కమిషన్‌ యొక్క రిపోర్టు వచ్చే వరకు సుప్రీం కోర్టును ఈ విషయం పై ఆగండి అని చెప్పిన కేంద్రం యొక్క కోరికని తోసిపుచ్చుతూ, ఏప్రిల్ 2023లో సుప్రీం కోర్టు ఈ రెండు దశాబ్దాలుగా పెండిగులో ఉన్న విషయాన్ని పట్ల విచారణను నిర్ణీత సమయంలో ముగించనున్నట్లు పేర్కొంది (ఇక్కడ, ఇక్కడ). దీనికి సంబంధించిన సుప్రీం కోర్టు యొక్క ‘record of proceedings’ను మీరు ఇక్కడ చూడవచ్చు.

అయితే కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలో నెలకొల్పిన ముగ్గురు సభ్యుల కమిషన్ యొక్క రిపోర్టు డిసెంబర్ 2025 నాటికి ఇంకా రావలిసి ఉంది. వారికి నవంబర్ 2025లో ప్రభుత్వం ఆరు నెలల పాటు గడువు కాలాన్ని పొడిగించింది (ఇక్కడ, ఇక్కడ). ఇలా ఈ కమిషన్‌కు గడువును పొడిగించడం ఇది రెండో సారి. గత ఏడాది వీరికి ఒక ఏడాది పాటు గడువు పెంచడం జరిగింది (ఇక్కడ, ఇక్కడ). 

దళిత క్రైస్తవులకు SC హోదా పట్ల కోర్టులు ఏమంటున్నాయి?

ఆంధ్రప్రదేశ్  హై కోర్టు

క్రైస్తవ మతంలోకీ మారిన వ్యక్తులు Scheduled Caste/Scheduled Tribe (Prevention of Atrocities) Act కింద రక్షణ పొందలేరని ఆంధ్రప్రదేశ్  హై కోర్టు ఏప్రిల్ 2025లో Akkala Rami Reddy v. The State of Andhra Pradesh కేసు నిమిత్త ఇచ్చిన తీర్పులో చెప్పింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 


అలహాబాద్ హై కోర్టు

క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల (SC) ప్రయోజనాలను (ఉద్యోగాలు, విద్య మొదలైన వాటిలో రిజర్వేషన్లు వంటివి) పొందకుండా చూసుకోవాలని అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 2025లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆదేశం, 1950 ప్రకారం, హిందూ, సిక్కు లేదా బౌద్ధులుగా మిగిలిపోయిన వ్యక్తులను మాత్రమే SC లుగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది – కాబట్టి ఎవరైనా క్రైస్తవుడిగా మారితే, ఆ చట్టం ప్రకారం వారు ఇకపై SC లుగా ఉండలేరు. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత SC ప్రయోజనాలను పొందడం కొనసాగించడం “రాజ్యాంగాన్ని మోసం” చేయడమే అవుతుందని కోర్టు పేర్కొంది. అటువంటి కేసులను గుర్తించి ఆపడానికి UP అధికారులకు నాలుగు నెలల సమయం ఇచ్చింది.

సుప్రీం కోర్టు 

కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడం కోసం వేరే మతంలోకి మారడం (ఆ మతం మీద నిజమైన నమ్మకం లేకుండా), రాజ్యాంగాన్ని మోసం చేయడం అని ఒక కేసు నిమిత్తం తీర్పు ఇస్తూ సుప్రీం కోర్టు నవంబర్ 2024లో చెప్పింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

చివరగా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వ ఇటీవల నిర్ణయం తీసుకోలేదు, ఆ హోదా కోసం ఏప్రిల్ 2023లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పటి వీడియో ఇది.

Share.

About Author

Comments are closed.

scroll