Fake News, Telugu
 

భారత జాతీయ జెండాను అవమానిస్తున్న ఈ వీడియోలోని సిక్కు నిరసనకారులు భారతదేశానికి చెందిన రైతులు కాదు

0

135 కోట్ల భారతావని యొక్క జాతీయ జెండాను కాళ్ళతో తొక్కి, పెట్రోల్ పోసి కాల్చుతున్న రైతులని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఢిల్లీ నగరంలో 26 జనవరి 2021 నాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలిలో విధ్వంసం చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలిలో రైతులు జాతీయ జెండాను కాళ్ళతో తొక్కి పెట్రోల్ పోసి కాల్చుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో చూపిస్తున్న ఈ ఘటన అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో నగరంలో చోటుచేసుకుంది. 1984 లో భారత దేశంలో జరిగిన సిక్కు మారణ హోమాన్ని నిరసిస్తూ కొందరు సిక్కు నిరసనకారులు భారత దేశ జెండాను ఇలా కాళ్ళతో తొక్కి అవమానించారు. ఈ ఘటన 25 జనవరి 2021 నాడు కాలిఫోర్నియా లోని సాక్రేమెంటో ప్రాంతంలో జరిగింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో  ‘amanvir_singh5’ అనే ప్రొఫైల్ ID పేరు కనబడుతుండడం మనం గమనించవచ్చు. ఆ పేరు కలిగిన సోషల్ మీడియా అకౌంట్ కోసం ఇంటర్నెట్ లో వెతికితే, Tiktok సోషల్ మీడియా ప్లాట్ఫారం లో ఇదే ప్రొఫైల్ ID పేరుతో అకౌంట్ ఉన్నట్టు తెలిసింది. పోస్టులో షేర్ చేసిన అదే వీడియో ఈ అకౌంట్ లో పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసి ఉంది. పోస్టులో కనిపిస్తున్న అదే సిక్కు నిరసనకారుడిని ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పూర్తి వీడియోని ఇక్కడ చూడవచ్చు.

‘amanvir_singh5’ పోస్ట్ చేసిన మరొక వీడియోలో, 1984 లో భారత దేశంలో జరిగిన సిక్కు మారణ హోమాన్ని నిరసిస్తూ 25 జనవరి 2021 నాడు 11 గంటలకి ‘7609 Wilbur Way, Sacramento, CA 95828’ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతునట్టు ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని ఆ వీడియోలో తను చెప్పాడు.

ఈ వీడియో వివరణలో చెప్పిన ప్రదేశం కోసం Google Street view లో వెతికితే, పోస్టులో షేర్ చేసిన వీడియో ‘amanvir_singh5’ చెప్పిన ప్రదేశంలోనే తీసిందని స్పష్టమయ్యింది. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న ఘటన భారత దేశంలో జరుగలేదు, అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో నగరంలో చోటుచేసుకున్నట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలని గూగుల్ స్ట్రీట్ వ్యూ లో కనిపించిన దృశ్యాలతో పోల్చిన ఫోటోని కింద చూడవచ్చు.

07 జనవరి 2021 నాడు ‘amanvir_singh5’ పోస్ట్ చేసిన వీడియోలో, తను అమెజాన్ వెబ్సైటులో ఆర్డర్ చేసిన భారతదేశ జాతీయ జెండాను కాల్చబోతునట్టు ప్రకటించాడు. ఒక ట్విట్టర్ యూసర్ భారతదేశ జెండాను ‘amanvir_singh5’ కు పంపకూడదని జెఫ్ బెజోస్ మరియు అమెజాన్ ట్విట్టర్ అకౌంట్లని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టారు. అంతేకాదు, భారత దేశ జెండాను అవమానించడానికి ప్రయత్నిస్తున్న ‘amanvir_singh5’  పేరుతో ఉన్న ఈ అకౌంట్ ని తొలగించాలంటూ ‘tiktok’ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ని ఈ ట్వీట్ లో ట్యాగ్ చేసారు. ‘amanvir_singh5’ పెట్టిన ఈ అమెజాన్ ఆర్డర్ పై “Ship to: Amanvir – Bakersfield, CA” అని రాసి ఉంది.

చివరగా, భారత జాతీయ జెండాను అవమానిస్తున్న ఈ ఘటన అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాక్రమెంటో నగరంలో చోటుచేసుకుంది, ఢిల్లీ లో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలిలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll