Fake News, Telugu
 

పాము ఆకారంలో ఉండే ఈ మొక్క (కోబ్రా లిల్లీ) కేవలం హిమాలయాల్లో మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది

0

పాము ఆకారంలో ఉన్న ఒక మొక్క వీడియోని షేర్ చేస్తూ ఇది హిమాలయాల్లో మాత్రమే కనిపించే నాగపుష్పం అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ మొక్కకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిమాలయాల్లో మాత్రమే కనిపించే నాగపుష్పం వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ మొక్క పేరు హిమాలయన్ కోబ్రా లిల్లీ కాగా, దీని శాస్త్రీయ నామం అరిసెమా కాన్సాంగ్యూనియం (Arisaema consanguineum). ఇది సహజంగా ఆసియాలో కనిపించే మొక్క. భూటాన్, నేపాల్, చైనా,మయన్మార్,థాయిలాండ్ మొదలైన ఆసియా దేశాలలో ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. భారత్ లో హిమాలయ ప్రాంతాలు, పశ్చిమ కనుమలు మొదలైన ఇతర ప్రాంతాలలో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో కనిపిస్తుంది హిమాలయన్ కోబ్రా లిల్లీ మొక్క. 16 జూలై 2021న వరల్డ్ స్నేక్ డే సందర్భంగా, ధర్మవీర్ మీనా అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి చెందిన అధికారి తన ట్విట్టర్ ఎకౌంటులో ఇదే వీడియోని షేర్ చేసాడు. ఇక్కడి నుండే ఈ వీడియో వైరల్ అయ్యింది. తను హిమాచల్ ప్రదేశ్ లో ఈ మొక్క వీడియో తీసినట్టు ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం ఈ హిమాలయన్ కోబ్రా లిల్లీ యొక్క శాస్త్రీయ నామం అరిసెమా కాన్సాంగ్యూనియం (Arisaema consanguineum), ఈ మొక్క యొక్క ఆకులు పాము ఆకారంలో ఉంటాయి కాబట్టి దీనికి కోబ్రా లిల్లీ అనే పేరు వచ్చింది. ఇది సహజంగా ఆసియాలో కనిపించే మొక్క. భూటాన్, నేపాల్, చైనా, మయన్మార్, థాయిలాండ్ మొదలైన ఆసియా దేశాలలో ఈ మొక్కలు కనిపిస్తుంటాయి.  ఇది సహజంగా పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్క అయినప్పటికీ, లోతట్టు  ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. భారతదేశంలో  హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎక్కువగా ఈ మొక్కలు కనిపిస్తాయి, ఐతే ఈ మొక్క కేవలం హిమాలయాలకే మాత్రం పరిమితం కాదు. పశ్చిమ కనుమలు మొదలైన ఇతర ప్రాంతాలలో కూడా ఈ మొక్క కనిపిస్తుంది.

అరిసెమాలో కనీసం 190 జాతుల వరకు ఉన్నాయి, ఇందులో ఎక్కువ శాతం చైనా మరియు జపాన్‌లో కనిపిస్తుంటాయి. హిమాలయ కోబ్రా లిల్లీ ఆసియాలో కనిపించే 190 కి పైగా అరిసెమా జాతులలో ఒకటి. అమెరికాలో కూడా అరిసెమా డ్రాకోంటియం (Arisaema dracontium) మరియు అరిసెమా ట్రిఫైలం (Arisaema triphyllum) అనే రెండు అరిసెమా జాతి రకాలు కనిపిస్తాయి.

ఇంతకు ముందు ఇలానే హిమాలయాల్లో మాత్రామే కనిపించే పుష్పం అని కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పుడు FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పాము ఆకారంలో ఉండే ఈ మొక్క (కోబ్రా లిల్లీ) కేవలం హిమాలయాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll