Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది అసలు పువ్వే కాదు, అది ఒక సముద్ర జీవి (‘సీ పెన్’)

1

హిమాలయ పర్వతం పై “నాగపుష్పం” విరిసిందని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): హిమాలయ పర్వతం పై “నాగపుష్పం” విరిసింది. ఈ పుష్పము 36 సంవత్సరాలకు ఒకసారి విచ్చుకుంటుంది.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది అసలు పుష్పమే కాదు. అది సముద్రం దిగువన ఉండే ఒక జీవి, ఇంగ్లీషు లో దాన్ని ‘సీ పెన్’ అని అంటారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.      

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ లో వెతకగా, ఫోటోలో ఉన్నది నాగపుష్పం కాదు అంటూ 2016 లో  ‘Journal of Environmental & Agricultural Sciences – JEAS’ వారు తమ ఫేస్బుక్ పేజీ లో పెట్టిన పోస్ట్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఫోటోలో ఉన్నది 36 ఏళ్ళకు ఒకసారి హిమాలయాల్లో వికసించే నాగ పుష్పం కాదని, అది ఒక జీవి అని ఆ పోస్ట్ లో ఉంటుంది. అంతే కాదు, ఆ జీవి సముద్రం దిగువన ఉంటుందని, దాన్ని ఇంగ్లీషు లో ‘సీ పెన్’ అంటారని కూడా ఆ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. ‘సీ పెన్ల’ గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.

ఫోటోలో ఉన్నది నాగ పుష్పం కాదని ఇంతకుముందే Snopes మరియు AFP-Factcheck లాంటి సంస్థలు రాసినట్టు చూడొచ్చు. పోస్ట్ లో ఉన్న ఫోటోని 2013 లో ‘Gordon J. Bowbrick’ అనే అతను తీసాడని, అతను కూడా ఫోటోలో ఉన్నది ‘Sea Feather’ అని ఫోటోకి టైటిల్ పెట్టాడని Snopes ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అంతే కాదు, ఇండోనేషియా లో కూడా ఇదే ఫోటో తో “Jawajiya పర్వతాల్లో 33 ఏళ్ళకు ఒకసారి వికసించే ‘మేగాపుస్ప’ అనే పువ్వు” అని వైరల్ అయ్యిందని ‘Pusat Informasi Anti Hoax’ ఆర్టికల్ లో చూడవచ్చు.

‘నాగ పుష్పం’ పేరుతో ఏమన్నా పువ్వులు ఉన్నాయా అని వెతకగా, ‘నాగ పుష్ప’ పేరుతో ఒక చెట్టు ఉందని తెలుస్తుంది. ‘Mesua Ferrea’ అనే చెట్టుని సంస్కృతంలో ‘నాగ పుష్ప’ అని అంటారు, కానీ పువ్వులు 36 ఏళ్ళకు ఒకసారి పూస్తాయని ఎక్కడా కూడా లేదు. 

చివరగా, ఫోటోలో ఉన్నది అసలు పువ్వే కాదు. అది ఒక సముద్ర జీవి (‘సీ పెన్’).

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll