Fake News, Telugu
 

పాత నిరసన వీడియోని బాలికల దినోత్సవం రోజు మహిళలు గుండు కొట్టించుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

జాతీయ బాలికల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ మహిళలు గుండ్లు కొట్టించుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జాతీయ బాలికల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ మహిళలు గుండ్లు కొట్టించుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. ఈ వీడియో 2018లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శిక్షా మిత్ర కాంట్రాక్టు ఉపాధ్యాయులు నిర్వహించిన ఒక పాత నిరసన కార్యక్రమం దృశ్యాలని చూపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్దీకరణ చేసి నెల జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ శిక్షా మిత్ర ఉపాధ్యాయులు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ఇటీవల జాతీయ బాలికల దినోత్సవం నాడు చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న ఫోటోని ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తా సంస్థ 26 జూలై 2018 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ శిక్షా మిత్ర కాంట్రాక్టు ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలని క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యాలని ఈ ఆర్టికల్‌లో తెలిపారు. లక్నో నగరంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పురుషులు అలాగే, స్త్రీ శిక్షా మిత్ర ఉపాధ్యాయులు గుండ్లు కొట్టించుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.

2018లో శిక్షా మిత్ర ఉపాధ్యాయులు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

2014లో అఖిలేష్ నాయకత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శిక్షా మిత్ర కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉద్యోగాలని క్రమబద్దికరించి వారి నెల జీతాన్ని పెంచింది. అయితే, 2017లో సుప్రీంకోర్టు శిక్షామిత్రలను శాశ్వత ఉపాధ్యాయులుగా నియమించడాన్ని రద్దు చేసింది.  ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లో ఉత్తీర్ణులైతే తప్ప కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలుగా నియమించకూడదని సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి నుండి శిక్షా మిత్ర ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతూనే ఉన్నారు.  ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో శిక్షా మిత్ర ఉపాధ్యాయులు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక పాత నిరసన కార్యక్రమానికి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఉత్తరప్రదేశ్‌లో శిక్షా మిత్ర ఉపాధ్యాయులు నిర్వహించిన పాత నిరసన వీడియోని జాతీయ బాలికల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ మహిళలు గుండ్లు కొట్టించుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll