బెంగుళూరులో నయాజ్ అనే వ్యక్తి ఉప్పుకు బదులు మూత్రం కలిపి పాప్‌కార్న్ తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క నిజానిజాల్ని తనిఖీ చేద్దాం.
క్లెయిమ్: బెంగళూరులో ఒక పాప్‌కార్న్ విక్రేత ఉప్పుకు బదులుగా పాప్‌కార్న్‌లో మూత్రాన్ని కలుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఫాక్ట్(నిజం): పాప్‌కార్న్ తయారీకి ఉపయోగించే వంటనూనెలో ఉమ్మివేసాడు అనే ఆరోపణతో, బెంగళూరు పోలీసులు నవాజ్ పాషా అనే పాప్‌కార్న్ విక్రేతను జూన్ 2022లో అరెస్టు చేశారు. విచారణ తర్వాత, ఉమ్మి వేయలేదు అని నిర్ధారించి స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసారు. పోస్టులో ఉప్పుకు బదులుగా మూత్రం ఉపయోగించి పాప్‌కార్న్ చేసాడు అని తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, మేము ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా, జూన్ 2022 నుండి ఈ వీడియో గురుంచి తెలిపిన అనేక వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ)
బెంగళూరులోని లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఒక స్టాల్‌ను కలిగి ఉన్న నవాజ్ పాషా అనే పాప్‌కార్న్ విక్రేతపైన వంటనూనెలో ఉమ్మివేసినట్లు కొందరు ఆరోపించారు.(పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్లు మూత్రం కాదు)
అనంతరం పోలీసులు నవాజ్‌ను అదుపులోకి తీసుకుని (FIR కాపీ), పాప్‌కార్న్ సిద్ధం చేయడానికి ఉపయోగించే నూనె బాటిల్ మరియు అతని పాప్‌కార్న్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ విషయం పైన తన వైపు కథ చెపుతూ, నవాజ్ ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. సీసాలో నూనె పోయడానికి ఆయిల్ ప్యాకెట్ చింపి ఆ చింపిన ప్యాకెట్ ముక్కను తాను నోట్లో పెట్టుకున్నట్లు చెప్పారు.
విచారణ తర్వాత, ఉమ్మి వేయలేదు అని నిర్ధారించి స్టేషన్ బెయిల్ మీద విడుదల చేసారు. వైరల్ వీడియోలో కనిపించే బాటిల్‌లో క్లెయిమ్ చేసినట్లుగా మూత్రం లేదు, నూనె ఉంది. నవాజ్ పాప్‌కార్న్ సిద్ధం చేయడానికి ఉప్పుకు బదులుగా మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒక కట్టు కథను రూపొందించి, ఈ సంఘటనను వైరల్ పోస్ట్‌లో తప్పుగా షేర్ చేస్తున్నారు.
చివరిగా, ఈ పాప్‌కార్న్ విక్రేతను వంట నూనెలో ఉమ్మివేసాడు అనే అనుమానంతో అరెస్టు చేశారు, మూత్రం కలిపినందుకు కాకుండా.