Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం చేప పిల్లల పెంపకం కోసం తెలంగాణ రాష్ట్రానికి గత మూడేళ్ళలో సుమారు 1200 కోట్లు ఇచ్చిందన్న వాదనలో నిజం లేదు

0

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చెరువులలో గత 3 సంవత్సరాల నుండి ఉచిత చేప పిల్లలను వదులుటకు కేంద్ర ప్రభుత్వం 1197 కోట్లు అందించిందని చెప్తూ, దీనికి సంబంధించిన గణాంకాలు షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజాలెంటో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చెరువులలో గత 3 సంవత్సరాల నుండి ఉచిత చేప పిల్లలను వదులటకు కేంద్ర ప్రభుత్వం 1197 కోట్లు అందించింది.

ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్ళలో (2020-23) ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను కింద తెలంగాణ రాష్ట్రానికి 52.13 కోట్లు విడుదల చేసింది. వీటిలో 202-21లో రూ.15.58 కోట్లు మరియు 2021-22లో రూ.12.98 కోట్లతో చేప పిల్లలను వదిలారు. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014-2021 మధ్య కాలంలో  రూ. 296.52 కోట్లతో 34.61 కోట్ల చేప పిల్లలను మరియు రూ. 42.76 కోట్లుతో 19.57 కోట్ల రొయ్య పిల్లలను సరఫరా చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్య్సకారుల అభివృద్ధికి చేపట్టిన ప్రత్యేక చర్యలలో భాగంగా 2016 నుండి ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రవేశపెట్టింది. అప్పటినుండి ప్రతీ ఏడాది కోట్ల సంఖ్యలో చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టులు మొదలైన నీటి వనరుల్లో ఉచితంగా వదులుతున్నారు. 2016 నుండి 2019 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు కింది టేబుల్‌లో చూడొచ్చు.

మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం 2014-2021 మధ్య కాలంలో రూ.296.52 కోట్లతో 34.61 కోట్ల చేప పిల్లలను మరియు రూ. 42.76 కోట్లతో 19.57 కోట్ల రొయ్య పిల్లలను సరఫరా చేసింది.

కేంద్ర ప్రభుత్వ సహాయం:

దేశంలో మత్స్య సంపదను ప్రోత్సహించడం, మత్స్యకారుల ఆదాయం పెంచడంతో దేశంలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను (PMMSY) ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చేప పిల్లల పంపిణి, ఫిష్ సీడ్ హేచరీల ఏర్పాటు, ఫిష్ కల్చర్ చెరువుల నిర్మాణం, రీక్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్/ బయో ఫ్లోక్ యూనిట్ల ఏర్పాటు, మొదలైన ప్రోత్సాహకాల అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేస్తుంది.

ఐతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో అందించిన సమాచారం ప్రకారం 2020-23 మధ్య మూడేళ్ళ కాలంలో PMMSY పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 52.13 కోట్లు విడుదల చేసింది. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్ళలో సుమారు 1200 కోట్లు ఇచ్చిందన్న వాదన తప్పని స్పష్టమవుతుంది.

వీటిలో 202-21లో రూ.15.58 కోట్లు మరియు 2021-22లో రూ.12.98 కోట్లు వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

అంతకు ముందు మత్స్య రంగ అభివృద్ధికి సంవత్సరాల వారీగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిన మొత్తం నిధులు సమాచారం ఇక్కడ చూడొచ్చు. ఈ సమాచారం ప్రకారం 2015-18 వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. కాగా 2018-19 & 2019-20 సంవత్సరానికి 15.74 కోట్లు మరియు 1.54 కోట్లు విడుదల చేసింది.

చివరగా, కేంద్ర ప్రభుత్వం చేప పిల్లల పెంపకం కోసం తెలంగాణ రాష్ట్రానికి గత మూడేళ్ళలో సుమారు 1200 కోట్లు ఇచ్చిందన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll