కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఇతర పార్టీ సభ్యులు కొందరు నల్లటి దుస్తులు ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 5 ఆగస్ట్ 2020న జరిగిన రామజన్మభూమి ఆలయ శంకుస్థాపన వేడుకకు వ్యతిరేకంగా ఇలా నల్ల దుస్తులు వేసుకొని కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేసారని చెప్తూ ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: 5 ఆగస్టు 2020న రామజన్మభూమి ఆలయ శంకుస్థాపనకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ఆగస్టు 2022లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా నల్లటి దుస్తులు వేసుకొని నిరసన తెలిపినప్పుడు తీసింది. ఈ సంఘటన క్లెయిమ్‌లో పేర్కొన్న విధంగా 2020లో జరిగింది కాదు, 5 ఆగస్టు 2022న జరిగింది. ఈ ఫోటోకి రామ జన్మభూమి ఆలయానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా పరిశోధన ప్రారంభించాము. ఈ సెర్చ్ ఫలితాలలో ఇదే ఫోటోని కలిగి ఉన్న అనేక వార్తా నివేదికలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వచ్చాయి. ఇవన్నీ ఆగస్టు 2022 నాటివి. ఈ సంఘటన రామ జన్మభూమి దేవాలయంతో ముడిపడి ఉందని చేస్తున్న వాదనకు విరుద్ధంగా, ధరల పెరుగుదల, నిరుద్యోగం మరియు నిత్యావసర వస్తువులపై GST పెంపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనగా వార్తా నివేదికలలో ఉంది.
ధరల పెరుగుదల, నిరుద్యోగం మరియు నిత్యావసర వస్తువులపై GST పెంపుపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా న్యూఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నల్ల బట్టలు ధరించి, పార్టీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్ వైపు కవాతు చేస్తున్న ఫోటో ఇది అని ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ 5 ఆగస్టు 2022 నాడు ప్రచురించింది.
చివరిగా, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు 2022లో చేసిన నిరసనలో భాగంగా నల్ల దుస్తులు ధరించారు, కానీ వైరల్ క్లెయిమ్ సూచించినట్లుగా రామజన్మభూమి ఆలయ శంకుస్థాపనకు వ్యతిరేకంగా 2020లో కాదు.