Fake News, Telugu
 

ఈ ఫోటో చైనాలో జరిగిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది; ఈ ఫోటోకి జర్మనీకి ఎటువంటి సంబంధంలేదు

0

రోడ్డుపై వందల కార్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినట్టు ఉండే ఒక ఫోటోని షేర్ చేస్తూ జర్మనీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచడంతో అక్కడి ప్రజలు నిరసనగా ఇలా రోడ్లపై తమ కార్లు వదిలి వెళ్లారని, వెంటనే ఆ దేశ ప్రభుత్వం పెట్రోల్ రేట్లు తగ్గించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జర్మనీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచడంతో అక్కడి ప్రజలు నిరసనగా రోడ్లపై తమ కార్లు వదిలి వెళ్లిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో 2012లో  చైనాలో సెలవుల సందర్భంగా అక్కడి ప్రభుత్వం మోటార్ వే టోల్స్ రద్దు చేసి రోడ్డు ప్రయాణం ఉచితం చేయడంతో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపై ప్రయాణించడంతో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని షెన్‌జెన్ పట్టణంలో సంభవించిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది. ఈ ఫోటోకి జర్మనీకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2012లో ప్రచురించిన ది టెలిగ్రాఫ్ పత్రిక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న షెన్‌జెన్ పట్టణంలో జరిగిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది. 2012లో  చైనాలో సెలవుల సందర్భంగా అక్కడి ప్రభుత్వం మోటార్ వే టోల్స్ రద్దు చేసి రోడ్డు ప్రయాణం ఉచితం చేయడం ఇలా ట్రాఫిక్ జామ్ కి దారితీసిందని ఈ కథనం యొక్క సారాంశం. ఈ ట్రాఫిక్ జాం కి సంబంధించి షట్టర్ స్టాక్ ఫోటోగ్రాఫర్ తీసిన మరిన్ని ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

పైన పేర్కొన్న వార్తా కథనం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2012లో చైనాలో జరిగిన ఈ ట్రాఫిక్ జామ్ కి సంబంధించి ది అట్లాంటిక్ ప్రచురించిన వార్తా కథనం కనిపించింది. విటన్నిటి బట్టి ఈ ఫోటో జర్మనీ లో పెట్రోల్ ధరలు పెంచడంతో అక్కడి ప్రజలు నిరసనగా తమ కార్లని రోడ్లపై వదిలేసిన ఘటనకి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

01 ఫిబ్రవరి 2021న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ పై ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (AIDC) విధించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఐతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సెస్ వల్ల వినియోగదారుడిపై అధికంగా ఎటువంటి భారం పడడంలేదు. ఎందుకంటే కొత్తగా విధించిన సెస్ కి అనుగుణంగా పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం విధించే బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ రెట్లని తగ్గించారు. దీనితో రాష్ట్రాల ఆదాయంలో కోత పడుతుంది. దీనికి సంబంధించి FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా పెట్రోల్ పై విధించే టాక్స్ లో కేంద్ర మరియు రాష్ట్ర వాటా, ఇంకా పెట్రోల్ పై టాక్స్ లకి సంబంధించి FACTLY రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

 చివరగా, ఈ ఫోటో చైనాలో జరిగిన ట్రాఫిక్ జామ్ కి సంబంధించింది; ఈ ఫోటోకి జర్మనీకి ఎటువంటి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll