Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతోనే లఖీంపూర్‌లో రైతులపైకి జీపును ఎక్కించానని వీడియోలోని వ్యక్తి అనలేదు

0

కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తాననటంతో లఖీంపూర్‌లో జీపును రైతుల పైకి ఎక్కించిన వ్యక్తి ఒప్పుకున్నాడని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. బీజేపీ కాన్వాయ్ లోకి దూరి కాంగ్రెస్ నేతలు జీపు నడిపిస్తున్నట్లుగా వీడియో ద్వారా ఒప్పుకున్న వ్యక్తి అని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తాననటంతోనే లఖీంపూర్‌లో జీపును రైతుల పైకి ఎక్కించానని ఒప్పుకున్న వ్యక్తి.

ఫాక్ట్: వీడియోలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు డబ్బులు ఇచ్చిందని గానీ, లేక తనే లఖీంపూర్‌లో జీపును రైతుల పైకి ఎక్కించానని గాని వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి అనలేదు. లఖీంపూర్‌లో జరిగిన హింసలో మూడు వాహనాలు ఉన్నాయి, మొదటిది థార్, రెండవది ఫార్చ్యూనర్, మూడవది స్కార్పియో; వీడియోలో మరియు కొన్ని కథనాల ప్రకారం, అంకిత్ దాస్ అనబడే వ్యక్తి ఫార్చ్యూనర్ కారులో కూర్చున్నాడని అంటున్నారు. అంకిత్ దాస్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అఖిలేష్ దాస్ మేనల్లుడు. కానీ, ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. లఖీంపూర్‌ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా, అతని తండ్రి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఇద్దరికీ అంకిత్ దాస్ సన్నిహితుడని అంకిత్ దాస్ ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తనకు డబ్బులు ఇచ్చిందని గానీ, లేక తనే లఖీంపూర్‌లో జీపును రైతుల పైకి ఎక్కించానని గానీ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి అనలేదు.

వీడియోలో, ఒక పోలీసు అధికారి గాయపడిన వ్యక్తిని ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. తాను లక్నోలోని చార్ బాగ్ ప్రాంతానికి చెందినవాడినని, అంకిత్ దాస్ అనే వ్యక్తితో కలిసి వెనక ఫార్చ్యూనర్ కారులో ఉన్నానని పేర్కొన్నాడు. కార్ యొక్క వివరాలు పొలిసు అధికారి అడిగినప్పుడు, ఆ వ్యక్తి చెప్పటం జరిగింది. ఫార్చ్యూనర్ ముందు వెళ్ళిన మహీంద్రా థార్ గురించి పోలీసు అడిగినప్పుడు, వారు ‘భైయ్యా’ తో ఉన్నారు, అతనికి తెలుసు, అని జవాబు ఇచ్చాడు. వీడియో యొక్క ప్రామాణికతను పోలీసులు ధృవీకరిస్తున్నారని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

అంకిత్ దాస్ ఎవరు ?

ఆజ్ తక్ కథనం ప్రకారం లఖీంపూర్‌లో జరిగిన హింసలో మూడు వాహనాలు పాల్గొన్నాయి. మొదటిది థార్, రెండవది ఫార్చ్యూనర్, మూడవది స్కార్పియో. వారి సోర్సెస్  ప్రకారం, అంకిత్ దాస్ తన ఫార్చ్యూనర్ కారులో కూర్చున్నాడని అంటున్నారు. అంకిత్ దాస్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అఖిలేష్ దాస్ మేనల్లుడు. 2017లో అఖిలేష్ దాస్ చనిపోయారు.

కానీ, ఆయనకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. అంతే కాదు, అంకిత్ దాస్ బీజేపీకి మద్దతుదారుడని తన సోషల్ మీడియా (ఫేస్బుక్) ప్రొఫైల్ ద్వారా తెలుస్తుంది. వాస్తవానికి, ఆజ్ తక్ రిపోర్ట్ చేసినట్లుగా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య రాక కోసం, ఆశిష్ మిశ్రా, అంకిత్ దాస్ ఫోటోలతో ఉన్న పోస్టర్లు 03 అక్టోబర్ 2021న లఖీంపూర్‌లోని పలు చోట్ల ఉంచారని తెలుస్తుంది.

అంకిత్ దాస్, ఆశిష్, అతని తండ్రి బీజేపీ నాయకుడు అజయ్ మిశ్రా ఇద్దరికీ దగ్గరగా ఉన్నట్టు ఈ ఫోటోల (ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా చూడొచ్చు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అయిన జన్మదినం సందర్భంగా ఆయన ఈ చిత్రాలను పంచుకున్నారు, ఆయనను తన “గైడ్”గా ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు.

ఆశిష్ మిశ్రా ట్విట్టర్ అకౌంట్‌లో మరియు బీజేపీ లఖీంపూర్‌ ట్విట్టర్ అకౌంట్‌లో అంకిత్ దాస్ కూడా ఉన్న ఫోటోలు చూడొచ్చు.

03 అక్టోబర్ 2021న ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్‌ ఖేరిలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల మీదికి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దేశవ్యాప్తంగా సంచలనం అయిన ఈ ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు 09 అక్టోబర్ 2021న అరెస్ట్ చేసారు.

చివరగా, కాంగ్రెస్ పార్టీ డబ్బు ఇస్తానని చెప్పడం వల్లనే లఖీంపూర్‌లో రైతులపైకి జీపును ఎక్కించానని వీడియోలోని వ్యక్తి అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll