Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు FRBM పరిమితులను దాటినప్పటికీ, అప్పులకు సంబంధించి ఈ వివరాలు మాత్రం కరెక్ట్ కాదు

0

1956 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు 3.14 లక్షల కోట్లైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ హయాంలో, ఈ 28 నెలల్లో చేసిన అప్పు మొత్తం 2.92 లక్షల కోట్లని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1956 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు 3.14 లక్షల కోట్లైతే, జగన్ ఈ 28 నెలల్లో చేసిన అప్పు మొత్తం 2.92 లక్షల కోట్లు.

ఫాక్ట్ (నిజం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు FRBM పరిమితులను దాటిన మాట నిజమైనప్పటికి, అప్పులకు సంబంధించి ఈ వివరాలు కరెక్ట్ కాదు. RBI లెక్కల ప్రకారం 2019 మార్చ్ నెల చివరకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు రూ. 2.64 లక్షల కోట్లు. ఇదే 2021 మార్చ్ నెల చివరకి కల్లా రూ. 3.57 లక్షల కోట్లకు చేరుకుంది. 2019లో రాష్ట్ర GSDPలో అప్పుల వాటా 30.6% కాగా, 2020లో 31.8% మరియు 2021(BE)లో 32.7% చేరుకుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రాష్ట్రాల అప్పులకు సంబంధించి రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా స్టేట్ ఫైనాసెస్స్: ఎ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2019 మార్చ్ నెల చివరకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు  రూ. 2.64 లక్షల కోట్లు. ఇదే 2021 మార్చ్ నెల చివరకి కల్లా రూ. 3.57 లక్షల కోట్లకు చేరుకుంది. ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇవి ఆయా సమయాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలు కాదు, ఆ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ బాకీ పడ్డ అప్పుల మొత్తం మాత్రమే. క్లుప్తంగా చెప్పాలంటే అంతకు ముందున్న ప్రభుత్వాలు చేసిన అప్పులు కూడా ఇందులో కలుస్తాయి. ఆరోజుకి తిరిగి చెల్లించని అప్పులన్నీ అందులోకి వస్తాయి.

2019 మార్చ్ చివరినాటికి  ఉన్న అప్పులకి 2021 మార్చ్ వచ్చేసరికి 93 వేల కోట్ల పెరుగుదల కనిపిస్తుంది. ఐతే పైన తెలిపిన అప్పుల వివరాలబట్టి ప్రస్తుత ప్రభుత్వం నికరంగా చేసిన అప్పులకు సంబంధించి మనము ఒక నిర్ధారణకు రాలేము, ఎందుకంటే  ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం, మేచ్యూర్ అయిన లోన్లు చెల్లించడం కూడా చేసి ఉంటుంది.

కాబట్టి GDPలో అప్పుల యొక్క నిష్పత్తిని (debt-to-GDP ratios) పరిగణలోకి తీసుకుంటే మనకు అప్పులకు సంబంధించి ప్రభుత్వ విధానాలపై సరైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GSDPలో అప్పుల వాటా 30.6% కాగా, 2020లో 31.8% మరియు 2021(BE)లో 32.7% చేరుకుంది. అప్పులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు కింది టేబుల్‌లో చూడొచ్చు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా అప్పులు చేయకుండా, ఆర్ధిక వ్యవస్థ నియంత్రణలో ఉంచేందుకు, 2003లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేనేజ్మెంట్ ఆక్ట్, 2003’ (FRBM)ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా  కేంద్ర, రాష్ట్రాల GDPలో (స్థూల జాతీయోత్పత్తి) ఫిస్కల్ డెఫిసిట్ శాతం, GDPలో అప్పుల శాతం మొదలైన అంశాలలో పరిమితులు విధించారు. ఈ ఆక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు రాష్ట్ర GSDPలో 20% మించకుండా ఉండేలా చూడాలని నిర్దేశించారు.

ఐతే పైన తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GSDPలో అప్పుల వాటా FRBM పరిమితులను మించిపోయాయని అర్ధమవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతున్నాయంటూ గతంలో CAG తమ నివేదికలో పేర్కొంది. కాకపోతే పోస్టులో తెలిపిన అప్పుల వివరాలు మాత్రం కరెక్ట్ కాదు. 

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు FRBM పరిమితులను దాటినప్పటికీ, అప్పులకు సంబంధించి ఈ వివరాలు మాత్రం కరెక్ట్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll