Fake News, Telugu
 

సమాంతర విశ్వం నుండి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తిని 1954లో జపాన్ దేశం టోక్యో విమానాశ్రయంలోని అధికారులు అరెస్ట్ చేసినట్టుగా చేస్తున్న ప్రచారం తప్పు

0

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ నిజమని నిరూపిస్తూ జపాన్ దేశంలో జరిగిన ఒక సంఘటన అంటూ ‘i News’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా షేర్ అవుతోంది. 1954లో జపాన్ దేశం టోక్యో నగరంలోని హానెడా విమానాశ్రయంలో మరో విశ్వం నుండి వచ్చిన ఒక వ్యక్తి అధికారుల కంటబడ్డాడని, భూమి మీద ఇప్పటివరకు లేని టౌర్డ్ అనే దేశం నుండి అతను వచ్చినట్టు అధికారులతో చెప్పినట్టు ఈ వీడియోలో తెలుపుతున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆ వ్యక్తి సంచరించినట్టుగా అతని పాస్‌పొర్టులో రాసి ఉందని, అధికారులు తన దేశాన్ని గుర్తించమని ప్రపంచ పటాన్ని ఇచ్చినప్పుడు, ఫ్రాన్స్-స్పెయిన్ దేశాల సరిహద్దులలోని అండోరా ప్రిన్సిపాలిటి ఆక్రమించిన ఒక ప్రాంతాన్ని తన దేశమనీ చూపించాడని ఈ వీడియోలో తెలుపుతున్నారు. టౌర్డ్ అనే దేశం ఈ భూమి మీద లేకపోవడంతో అధికారులు మొదట అతన్ని అరెస్ట్ చేసి, అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకొనేందుకు అతని వస్తువులను చెక్ చేశారని ఈ వీడియోలో తెలిపారు. ఆ వ్యక్తి తాను పని చేసిన కంపెనీ, దిగిన హోటల్ గురించి అధికారులకు చెప్పాడు కానీ, అతను చెప్పిన హోటల్‌లో అతని పేరుతో ఎటువంటి బూకింగ్స్ లేకపోవడంతో, అతను ఏదో తప్పు చేస్తున్నాడని అధికారుల అనుమానించి, ఒక హోటల్‌లో అతన్ని తమ అదుపులో ఉంచుకున్నారని ఈ వీడియోలో తెలిపారు. అయితే, మరుసటి రోజు ఉదయానికి ఆ వ్యక్తి హోటల్ నుండి అదృశ్యమయ్యడాని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ వ్యక్తి వివరాలు, అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారని ఈ పోస్టులో తెలుపుతున్నారు. సమంతార ప్రపంచం నుంచి దారితప్పి కాలంతారాలను దాటి ఈ వ్యక్తి భూమి మీదకు వచ్చినట్టు కొందరు అనుమానిస్తున్నారని ఈ రిపోర్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సమాంతర విశ్వం నుండి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తిని 1954లో జపాన్ దేశం టోక్యో విమానాశ్రయంలోని అధికారులు అరెస్ట్ చేశారు.

ఫాక్ట్ (నిజం): 1959లో జపాన్ దేశంలోని టోక్యో విమానాశ్రయంలో ఒక వ్యక్తి ప్రపంచంలో ఇప్పటి వరకు లేని టౌర్డ్ అనే దేశం నుండి వచ్చినట్టుగా అధికారులను మోసగించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. జాన్ అలెన్ జేగ్రస్ అనే వ్యక్తి, టౌర్డ్ అనే దేశానికి చెందినవాడిగా ఒక నకిలీ పాస్‌పొర్ట్ తయారుచేసుకొని అనేక దేశాలను సంచరించాడని, కొరియాకు చెందిన తన భార్యతో సహా జపాన్ దేశానికి వచ్చినప్పుడు, టోక్యో విమానాశ్రయంలో అధికారులు అతన్ని విచారించి అరెస్ట్ చేశారని తెలిసింది. చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి అడుగుపెట్టాడానే ఆరోపణ కింద టోక్యో న్యాయమూర్తి జాన్ అలెన్ జేగ్రస్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. సమంతార ప్రపంచం నుంచి టైమ్ ట్రావెల్ చేసి ఈ వ్యక్తి జపాన్‌కు వచ్చినట్టుగా షేర్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న ప్రచారానికి సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, జపాన్ దేశంలో ఇటువంటి సంఘటనే ఒకటి గతంలో చోటుచేసుకుందని ఒక ఆర్టికల్ రిపోర్ట్ చేసినట్టు తెలిసింది. 1959లో జపాన్ దేశంలోని విమానాశ్రయంలో ఒక వ్యక్తి ప్రపంచంలో ఇప్పటి వరకు లేని టౌర్డ్ అనే దేశం నుండి వచ్చినట్టుగా అధికారులను మోసగించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడని ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. జాన్ అలెన్ జేగ్రస్ అనే వ్యక్తి, నకిలీ పాస్‌పొర్ట్ తయారుచేసుకొని టౌర్డ్ అనే దేశానికి చెందినవాడిగా అనేక దేశాలను సంచరించి, చివరికి టోక్యో విమానాశ్రయంలో అధికారులకు దొరికినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.  

జాన్ అలెన్ జేగ్రస్ బోగస్ పాస్‌పొర్ట్ ఉపయోగించి, కొరియాకు చెందిన తన భార్యతో కలిసి జపాన్ దేశంలోకి ప్రవేశించినట్టు తెలిసింది. జాన్ అలెన్ జేగ్రస్ గురించి జపాన్ వార్తా పత్రిక పబ్లిష్ చేసిన ఒక పాత కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. ప్రపంచం మొత్తం సంచరించాలనే ఉద్దేశంతో, జాన్ అలెన్ జేగ్రస్, ఒక కొత్త దేశం, దాని రాజధాని మరియు భాషల పేర్లను సృష్టించి, ఒక నకిలీ పాస్‌పొర్ట్‌ను సృష్టించి మిడిల్ ఈస్ట్‌తో సహా అనేక దేశాలను సంచరించాడాని ఇందులో రిపోర్ట్ చేశారు. చివరకు టోక్యో నగరంలోని హానెడా విమానాశ్రయంలోని అధికారులకు జయం అలెన్ దొరికినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. జాన్ అలెన్ జేగ్రస్ పాస్‌పొర్ట్‌లో తెలిపిన సమాచారం మొత్తం ఫేక్ అని ఈ వార్తా సంస్థ స్పష్టం చేసింది.    

చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి అడుగుపెట్టడనే ఆరోపణ కింద టోక్యో న్యాయమూర్తి జాన్ అలెన్ జేగ్రస్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. అంతేకాదు, టోక్యో న్యాయమూర్తి తీర్పు వెలువదించిన వెంటనే జాన్ అలెన్ జేగ్రస్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడనీ, వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స ఇచ్చినట్టు ‘Snopes’ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో తెలిపారు. జాన్ అలెన్ జేగ్రస్‌కు సంబంధించి గానీ, అతని భార్యకు సంబంధించి ఇంకే సమాచారం దొరకలేదని ఈ ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌లో స్పష్టం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన వార్తా కథనాలు, ఈ-కామర్స్ సైట్లలో ఉన్న పుస్తకాలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా సమంతార ప్రపంచం నుంచి టైమ్ ట్రావెల్ చేసి ఈ వ్యక్తి జపాన్‌కు వచ్చినట్టుగా షేర్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సమాంతర ప్రపంచం నుండి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తిని 1954లో జపాన్ దేశం టోక్యో విమానాశ్రయంలోని అధికారులు అరెస్ట్ చేసినట్టుగా చేస్తున్న ప్రచారం తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll