“జపాన్‌లో యుద్ధ సమయంలో ఒక బాలుడు చనిపోయిన తన సోదరుడిని అంత్యక్రియల కోసం వీపుపై మోస్తున్నప్పుడు అది చూసిన ఒక సైనికుడు ఆ బాలుడితో తన వీపుపై మృతదేహాన్ని విసిరేయమని చెప్పగా, ఆ బాలుడు ఈ మృతదేహం నాకు భారంగా లేదు, అతను నా సోదరుడు అని బాలుడు సమాధానం చెప్పాడు” అని చెపుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ & ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు మద్దతుగా ఒక బాలుడు తన వీపుపై నిర్జీవంగా ఉన్న శరీరాన్ని మోస్తున్నట్లు చూపిస్తున్న ఫోటో ఒకటి షేర్ చేస్తున్నారు ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జపాన్‌లో యుద్ధ సమయంలో, ఒక బాలుడు చనిపోయిన తన సోదరున్ని అంత్యక్రియల కోసం వీపుపై మోస్తున్నట్లు చూపించే ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటో 1945లో జపాన్‌పై అమెరికా అణు దాడి చేసిన తర్వాత తీసింది. ఈ ఫోటో నాగసాకిలోని ఓ శ్మశాన వాటిక వద్ద ఒక జపాన్ బాలుడు సైనిక భంగిమలో నిలబడి, తన చనిపోయిన తమ్ముడిని వీపుపై మోస్తుండం చూపిస్తుంది. ఈ ఫోటోను U.S మెరైన్ కార్ప్స్ ఫోటోగ్రాఫర్ Joe O’ Donnell తీశారు. బాలుడు, సైనికుల మధ్య మృతదేహాన్ని విసిరేయమని పోస్టులో చెప్పినట్లు సంభాషణ జరిగినట్లు చెప్పడానికి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘రేర్ హిస్టారికల్ ఫోటో’ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఇదే ఫోటోను (ఆర్కైవ్డ్ లింక్) మేము కనుగొన్నాము. ఈ ఫోటో వివరణలో, “1945లో చనిపోయిన తన తమ్ముడిని శ్మశాన వాటిక వద్దకు తీసుకువచ్చిన తర్వాత సైనిక భంగిమలో నిలబడి ఉన్న ఒక జపనీస్ బాలుడు” అని పేర్కొనబడింది. అలాగే, ఈ ఫోటోను 1945లో U.S మెరైన్ ఫోటోగ్రాఫర్ Joe O’ Donnel తీశారని పేర్కొన్నారు.

1945లో, జపాన్ అమెరికాకు లొంగిపోయిన తర్వాత, అమెరికన్ మిలిటరీ Joe O’Donnellను ఫైర్ బాంబ్ ఎయిర్ స్ట్రైక్, అణు బాంబ్ వల్ల జపాన్‌లో జరిగిన విధ్వంసాన్ని డాక్యుమెంట్ చేయడానికి పంపింది. కొన్ని సంవత్సరాల తర్వాత, Joe O’Donnell జపాన్ జర్నలిస్ట్‌తో ఇంటర్వ్యూలో ఆయన ఈ ఫోటో గురించి మాట్లాడుతూ, “దాదాపు పది సంవత్సరాల వయస్సు గల ఒక బాలుడు తన వీపుపై ఒక బిడ్డను మోసుకెళ్తూ కనిపించాడు. అప్పట్లో జపాన్‌లో పిల్లలు తమ తమ్ముడు లేదా చెల్లిని వీపుపై మోస్తూ ఆడుకోవడం సాధారణమే. కానీ, ఈ బాలుడు మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించాడు. అతను ఎందుకో ఎంతో గంభీరంగా కనిపించాడు. పాదరక్షలు లేవు. ముఖం కఠినంగా మారింది. బిడ్డ తల వెనక్కి ఒరిగిపోయింది, వీపుపై ఉన్న బాలుడు నిద్రలో ఉన్నట్లు అనిపించింది. బాలుడు అక్కడ ఐదు లేదా పదినిమిషాలు నిలుచున్నాడు. తెల్ల మాస్కులు ధరించిన వ్యక్తులు బాలుడి దగ్గరకు వచ్చి, వీపుపై ఉన్న బిడ్డ చుట్టూ చుట్టిన తాడును మెల్లగా విప్పారు. అప్పుడు నేను గ్రహించాను, ఆ బిడ్డ అప్పటికే మృతిచెందిందని, వారు మృతిచెందిన బిడ్డ చేతులు, కాళ్ళను పట్టుకుని నిప్పు మీద పెట్టారు. బాలుడు కదలకుండా నిశ్చలంగా ఆ మంటలను చూస్తూ నిల్చున్నాడు. తన పెదవిని గట్టిగా కొరికగా రక్తం మెరుస్తూ కనిపించింది. ఆ తర్వాత బాలుడు వెనక్కి తిరిగి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.” అని చెప్పారు.
Joe O’Donnell ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా బాలుడిని తన తమ్ముడి మృతదేహాన్ని విసిరేయమని ఎవరూ అడిగినట్లు పేర్కొనలేదు.ఈ ఫోటోను 1945లో నాగసాకిలో తీసిందిగా వివిధ వార్తా సంస్థలు పేర్కొంటూ కథనాలు, వీడియోలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ)

Joe O’Donnell డాక్యుమెంట్ చేసిన కొన్ని ఫోటోలను తొలిసారిగా “Japan 1945: A U.S. Marine’s Photographs from Ground Zero” పుస్తకంలో ప్రచురించబడ్డాయి. Joe O’Donnell తీసిన కొన్ని ఫోటోలు ‘Five College Consortium’ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించబడ్డాయి.

చివరిగా, ఈ ఫొటోలో ఉన్న జపాన్ బాలుడితో ఓ సైనికుడు అతని వీపుపై ఉన్న మృతదేహాన్ని పడవేయమని చెప్పాడని ధృవీకరించడానికి ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు.