Fake News, Telugu
 

మధ్యప్రదేశ్ కి చెందిన మసీదు ఫోటోని ముంబై బాంద్రా లోని మసీదు అని షేర్ చేస్తున్నారు

0

రోడ్డు మధ్యలో నిర్మించిన మసీదు యొక్క ఫోటోని చూపిస్తూ ముంబై నగరంలోని బాంద్రా లో నడిరోడ్డు పై నిర్మించిన ఈ మసీదును కూల్చే దమ్ము మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాక్రే కు ఉందా? అని ప్రశ్నిస్తూ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటివలే ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) బాలీవుడ్ నటి  కంగనా రనౌత్ ఆఫీసును అక్రమ కట్టడం అని చెప్పి కుల్చేసిన నేపథ్యంలో ఈ పోస్ట్ షర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంత వరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముంబై నగరంలోని బాంద్రా లో నడి రోడ్డు పై నిర్మించిన మసీదు యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో రోడ్డు మధ్యలో నిర్మించబడినట్టు కనిపిస్తున్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ అనే నగరానికి చెందిన జామా మసీదు. ఈ మసీదు ఫోటోకి ముంబై బాంద్రా ప్రాంతంకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ ఒక ట్విట్టర్ యూసర్ ‘10 August 2020’ నాడు పెట్టిన ట్వీట్ దొరికింది. ఫోటోలోని ఆ మసీదు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ నగరానికి చెందినది అని ఆ ట్వీట్లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ మసీదు కోసం వెతకగా, అదే ఫోటోని షేర్ చేస్తూ ‘Dainik Sarkar’ న్యూస్ వెబ్సైట్ వారు పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ దొరికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ నగరంలో, రక్షా బంధన్ మరియు ఈద్ పండగల సందర్భంగా కాట్ర బజార్ లో లాక్ డౌన్ తర్వాత మొదటిసారిగా షాపింగ్ చేయడానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, అని ఆ ఆర్టికల్ లో తెలిపారు. ఫోటోలో కనిపిస్తున్నది కాట్ర బజారు సమీపంలోని జామా మసీదు అని ఆర్టికల్ లో తెలిపారు. ఫోటోలోని ఆ మసీదును చూపిస్తూ యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియో వివరణలో కూడా ఫోటోలోని ఆ మసీదు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ నగరానికి చెందిన జామా మసీదు అని తెలిపారు.

సాగర్ నగరంలోని జామా మసీదు యొక్క సాటిలైట్ పిక్చర్ ‘Google Earth’ లో లభించింది. ఈ సాటిలైట్ ఇమేజ్ లో కూడా ఈ మసీదు నాలుగు దిక్కుల రోడ్డు మధ్యలో కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

చివరగా, మధ్యప్రదేశ్ కి చెందిన మసీదు యొక్క ఫోటోని చూపిస్తూ ముంబై బాంద్రా లోని మసిదుగా చిత్రీకరిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll