కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి ముస్లింలకు దుబాయ్/UAEలోని ‘అసోసియేషన్ ఫర్ సున్నీ ముస్లిమ్స్’ ఆర్థిక సహాయాన్ని అందిస్తోందంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. భారత ఎన్నికల్లో ఓటు వేయబోయే వారికి విమాన టికెట్‌లు అందిస్తామని, ముస్లింలకు నిజమైన స్నేహితుడైన కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం అని ఈ లెటర్‌లో పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: భారత్‌లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఓటు వేసే ముస్లింలకు దుబాయ్‌లోని ‘అసోసియేషన్ ఫర్ సున్నీ ముస్లిమ్స్’ ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.
ఫాక్ట్(నిజం): ‘అసోసియేషన్ ఫర్ సున్నీ ముస్లిమ్స్’ పేరుతో దుబాయ్/UAEలో ఒక సున్నీ అసోసియేషన్ ఉన్నట్టు మాకు ఎలాంటి సమాచారం లభించలేదు. పైగా ఈ లెటర్‌లో పేర్కొన్న అడ్రస్ దుబాయ్‌లోని పాకిస్తాన్ కాన్సులేట్ జనరల్‌ది. ఇకపోతే లెటర్‌లో అందించిన నంబర్లలో ఒకటి దుబాయ్‌లోని ఒక కాఫీ మెషీన్‌ల సంస్థది. వీటన్నిటిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న లెటర్ ఫేక్ అని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ లెటర్‌లో పేర్కొన్న అసోసియేషన్‌కు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా దుబాయ్/UAEలో ఆ పేరుతో ఒక అసోసియేషన్ ఉన్నట్టు ఎలాంటి సమాచారం లభించలేదు. ఇలాంటి ఒక అసోసియేషన్ నిజంగానే ఇలా చేసి ఉంటే, మీడియా ఈ వార్తను ప్రచురించి ఉండేది, కానీ మాకు అలాంటి వార్తా కథనాలేవి లభించలేదు.
ఆ తరవాత లెటర్‌లోని అడ్రస్ (#2-11th Street Khalid Bin Waleed Road Plot No. Umm Hurair One Dubai United Arab Emirates) ఆధారంగా గూగుల్ మ్యాప్స్‌లో వెతకగా, ఇది దుబాయ్‌లోని పాకిస్తాన్ కాన్సులేట్ జనరల్ అడ్రస్ అని తెలిసింది.
ఇకపోతే ఆ లెటర్‌లో పేర్కొన్న మూడు మొబైల్ నంబర్‌లలో ఒకటి వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్‌గా రిజిస్టర్ అయ్యి ఉంది. ఇది డాల్‌మైర్ (Dallmayr) అనే జెర్మనీకి చెందిన కాఫీ మెషిన్‌ల సంస్థ యొక్క దుబాయ్ బ్రాంచ్‌కు చెందిన నెంబర్ అని తెలిసింది. వీరి ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న లెటర్ ఫేక్ అని స్పష్టమవుతుంది.
కాగా ఇతర రెండు నంబర్లను మేము వాట్సాప్ ద్వారా సంప్రదించాము. ఈ లెటర్‌కు సంబంధించిన సమాచారం కోరాము, వారి జవాబు ఆధారంగా ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, దుబాయ్‌లోని ఒక సున్నీ సంస్థ భారత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడానికి ఆర్ధిక సహాయాన్ని చేస్తుందంటూ షేర్ చేస్తున్న ఈ లెటర్ ఫేక్.