హైదరాబాద్‌లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇటీవల రోహింగ్యాలకు హామీ ఇచ్చినట్టు ‘దిశ’ వార్తా పత్రిక ప్రచురించిన కథనమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. రోహింగ్యా కుటుంబాలకు ఉండటానికి స్థలం, ఇళ్లు కట్టించి, వారి కోసం ప్రత్యేక క్రీడా మైదానం మరియు మసీదులు నిర్మిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా ఈ వార్తా కథనం రిపోర్ట్ చేస్తుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్‌లో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా షేర్ చేస్తున్న దిశ వార్తా పత్రిక కథనం.
ఫాక్ట్ (నిజం): రోహింగ్యా ముస్లింలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా ‘దిశ’ వార్తా పత్రిక ఇటీవల ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ‘దిశ హైదరాబాద్ టాబ్లాయిడ్’ వార్తా పత్రిక 27 నవంబర్ 2023 ఎడిషన్‌లోని 6వ పేజీలో ప్రచురించిన ఒక కథనాన్ని ఎడిట్ చేసీ ఈ ఫోటోని రూపోందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వార్తా కథనాన్ని ‘దిశ’ వార్తా పత్రిక పబ్లిష్ చేసిందా అని వెతికితే, ‘దిశ’ పత్రిక అటువంటి వార్త ఏదీ తమ పత్రికలో ప్రచురించలేదని తెలిసింది. రోహింగ్యా ముస్లింలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా ‘దిశ’ వార్తా పత్రికతో పాటు మరే వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు.
అయితే, వైరల్ పేపర్ క్లిప్పింగ్‌లోని వార్తా కథనం పక్కన మరియు పైభాగంలో ఉన్న వార్తా కథనాల ఆధారంగా, ‘దిశ’ ఈ-పేపర్లో వెతకగా, ఆ వార్తా కథనాలు ‘దిశ హైదరాబాద్ టాబ్లాయిడ్’ వార్తా పత్రిక 27 నవంబర్ 2023 ఎడిషన్‌లోని 6వ పేజీలో వచ్చినట్లు గుర్తించాము. ప్యాంథర్స్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మరియు ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్ధి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తాలను ఈ రెండు వార్తా కథనాలు రిపోర్ట్ చేస్తున్నాయి.
ఈ వార్తా కథనాల పక్కన, “రూమీల సీతారాం కుమార్‌కు సేవారత్న పురస్కారం”, అనే టైటిల్‌తో ప్రచురించిన కథనం ఉంది. బర్కత్‌పుర రాజాబహదూర్ వెంకట్ రామారెడ్డి మహిళా కళాశాలలో ఫుడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రుమీల సీతారాం కుమార్‌కు సేవా రత్న పురస్కారం 2023 ప్రధానం చేసినట్టు అసలైన వార్తా కథనంలో రిపోర్ట్ చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న రోహింగ్యాలకు సంబంధించిన ఒక పాత ఫోటోని జత చేస్తూ ఈ ఫేక్ ‘దిశ’ వార్తా కథనాన్ని రూపొంధించినట్టు తెలిసింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఇటువంటి ఫేక్ కథానాలకు సంబంధించి ఫాక్ట్‌లీ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, రోహింగ్యా ముస్లింలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఈ ‘దిశ’ వార్తా పత్రిక కథనం ఫేక్.