Coronavirus Telugu, Fake News, Telugu
 

ఇది CT స్కానింగ్ తో కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి జరిపిన పరిశోధనలో భాగంగా తీసిన స్కాన్ రిపోర్ట్

0

కరోనా వాక్సిన్ వేసుకోవడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఛాతి యొక్క CT స్కాన్స్ కి సంబంధించిన ఫోటోలో ఎడమవైపు ఊపిరితిత్తులు స్పష్టంగా కనిపిస్తున్న స్కాన్ కరోనా వాక్సిన్ తీసుకున్న వ్యక్తిదని, కుడివైపు ఊపిరితిత్తులు స్పష్టంగా కనిపించని స్కాన్ ఫోటో కరోనా వాక్సిన్ తీసుకోని వ్యక్తిదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా వాక్సిన్ తీసుకున్న మరియు తీసుకోని వ్యక్తుల ఛాతి యొక్క రెండు CT స్కాన్స్ ఫోటో.

ఫాక్ట్(నిజం): ఈ CT స్కాన్ వాంకోవర్ జనరల్ హాస్పిటల్, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం మరియు వాంకోవర్ కోస్టల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన సైంటిస్టులు, రేడియాలజిస్టులు ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో CT స్కాన్‌లను ఉపయోగించి తెలుసుకొనేoదుకు జరిపిన పరిశోధనలలో భాగంగా తీసింది. ఈ CT స్కాన్ కరోనా వాక్సిన్ అందుబాటులోకి రాకముందు తీసింది. కావున ఈ స్కానింగ్ రిపోర్ట్ కి వాక్సిన్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని CT స్కాన్ యొక్క ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ఏప్రిల్ 2020లో ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం యొక్క తేదిని బట్టి ఈ CT స్కాన్ కరోనా వాక్సిన్ కి సంబంధంలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికింకా కరోనా వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ కథనం ప్రకారం వాంకోవర్ జనరల్ హాస్పిటల్, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం, వాంకోవర్ కోస్టల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన సైంటిస్టులు, రేడియాలజిస్టులు ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో CT స్కాన్‌లను ఉపయోగించి తెలుసుకొనేందుకు పరిశోధనలు చేస్తున్నారు.

పైన తెలిపిన కథనం ఆధారంగా బ్రిటిష్ కొలంబియా ఇన్స్టిట్యూట్స్ వెబ్సైటులో వెతకగా, కరోనాని CT స్కాన్ ద్వారా గుర్తించడానికి చేసిన పరిశోధనలకి సంబంధించిన సమాచారంతో పాటు పోస్టులో ఉన్న ఫోటోని ప్రచురించారు.

వాంకోవర్ కోస్టల్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా తమ వెబ్సైటులో ఈ రీసెర్చ్ కి సంబంధించిన సమాచారంతో పాటు ఇదే ఫోటోని ప్రచురించింది. వీటన్నిటిబట్టి, ఈ ఫోటో కరోనా వాక్సిన్ తీసుకున్న వ్యక్తిది కాదని, కరోనా సోకిందో లేదో CT స్కాన్ ద్వారా తెలుసుకోవడానికి చేసిన పరిశోధనలో భాగంగా తీసిందని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఐతే పోస్టులో ఈ ఫోటోని ప్రజలను వాక్సిన్ వేయించుకోవడానికి ప్రోత్సహించే ఉద్దేశంతో షేర్ చేసినప్పటికీ, పోస్టులో చెప్తున్నదానికి ఈ ఫోటో నేపథ్యానికి సంబంధం లేదు. పైగా, ఈ ఫోటో కొందరిని భయాందోళనలకు గురిచేసే అవకాశం ఉంది.

చివరగా, ఇది స్కానింగ్ తో కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి జరిపిన పరిశోధనలో భాగంగా తీసిన CT స్కాన్ రిపోర్ట్.

Share.

About Author

Comments are closed.

scroll