Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలో ఒక విద్యార్థి భీమ్లా నాయక్ కథ రాసినట్టు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తను ప్రసారం చేయలేదు

0

‘పదవతరగతి మూల్యంకనం లో ఓ జవాబుకి బదులు భీంలానాయక్ కథ రాసిన విద్యార్థికి సున్నా మార్కులు’ , అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఒక వార్తా ప్రసారం చేసినట్టు ఒక స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘పదవ తరగతి మూల్యంకనం లో ఓ జవాబుకి బదులు భీంలానాయక్ కథ రాసిన విద్యార్థికి సున్నా మార్కులు’ – ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం.

ఫాక్ట్: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన పదో తరగతి ఫలితాల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలో ఒక విద్యార్థి జవాబుకి బదులు భీమ్లా నాయక్ కథ రాసినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తను ప్రసారం చేయలేదు. పోస్టులో షేర్ చేసిన స్క్రీన్ షాట్ డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఫలితాలు 06 జూన్ 2022న విడుదలవగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ అనే కార్యక్రమాన్ని చివరిసారిగా 04 జూన్ 2022న టెలికాస్ట్ చేసింది. దీన్నిబట్టి ఆ స్క్రీన్ షాట్ డిజిటల్‌గా రూపొందించిందని స్పష్టమవుతుంది. పైగా ఆ స్క్రీన్ షాట్‌లో కొన్ని స్పెల్లింగ్ తప్పులు చూడొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి ఫలితాలను 06 జూన్ 2022న విడుదల చేసింది. ఈ ఫలితాలలో మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఐతే ఈ ఫలితాలలో చాలా మంది ఫెయిల్ అవ్వడంతో వివాదం కూడా నెలకొంది.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు పరీక్షలో ఒక విద్యార్థి  జవాబుకి బదులు భీమ్లా నాయక్ కథ రాసినట్టు మాత్రం ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు లేవు. ఒకవేళ ఇలా నిజంగానే జరిగి ఉంటే మీడియా ఈ వార్తను రిపోర్ట్ చేసి ఉండేది, కాని అలాంటి కథనాలేవి మాకు లభించలేదు.

పోస్టులో షేర్ చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం యొక్క స్క్రీన్ షాట్ నిజం కాదు, అది డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. పోస్టులో షేర్ చేసిన స్క్రీన్ షాట్‌ ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ అనే కార్యక్రమానికి సంబంధించింది. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలను 06 జూన్ 2022న విడుదల చేయగా, ఆంధ్రజ్యోతి ఛానల్ 06 జూన్ లేదా ఆ తరవాత ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదు. ఇది వారానికి ఒకసారి టెలికాస్ట్ అయ్యే కార్యక్రమం. చివరిసారిగా 04 జూన్ 2022న ఈ కార్యక్రమం టెలికాస్ట్ అయ్యింది, అంటే ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలను విడుదల కాకముందు.

అలాగే పోస్టులో షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో కొన్ని స్పెల్లింగ్ తప్పులు చూడొచ్చు. ‘మూల్యాంకనం’ బదులుగా ‘మూల్యంకనం’ మరియు ‘భీమ్లా నాయక్’ బదులుగా ‘భీంలానాయక్’ అని తప్పుగా రాసారు. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి తమ ఇతర కథనాలలో ‘మూల్యాంకనం’ మరియు ‘భీమ్లా నాయక్’ అనే రాసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఒక వార్తా సంస్థ ఇలాంటి తప్పులు చేయడం అసహజం. వీటన్నిటిబట్టి, పోస్టులో షేర్ చేసిన వార్త ఆంధ్రజ్యోతి ప్రసారం చేయలేదని, అది డిజిటల్‌గా రూపొందించిందని స్పష్టంగా అర్ధమవుతుంది.

చివరగా, ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలో ఒక విద్యార్థి భీమ్లా నాయక్ కథ రాసినట్టు ఆంధ్రజ్యోతి ఎటువంటి వార్తను ప్రసారం చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll