Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీకి నీరవ్ మోదీ 98కోట్ల విరాళం ఇచ్చినట్టు ఉన్న ఈ చెక్ నిజమైనది కాదు

0

2011లో నీరవ్ మోదీ కాంగ్రెస్ పార్టీకి 98 కోట్ల విరాళం ఇచ్చారని చెప్తూ, దీనికి సంబంధించిన ఒక చెక్‌ ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. మా వాట్సాప్ టిప్ లైన్‌కి (+91 9247052470) కూడా ఇదే చెక్‌కి సంబంధించి వివరణ కోరుతూ సందేహాలు పంపించారు. ఈ కథనం ద్వారా ఆ చెక్‌కి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 2011లో నీరవ్ మోదీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 98 కోట్ల విరాళం యొక్క చెక్.

ఫాక్ట్(నిజం): రాజకీయ పార్టీ విరాళాలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్‌లో అందుబాటులో ఉన్న వివరాలలో 2011-12 సంవత్సరానికి గాను కాంగ్రెస్ పార్టీ 98 కోట్లు విరాళం పొందినట్టు ఎటువంటి సమాచరం లేదు. ఆ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పొందిన మొత్తం విరాళాల విలువ సుమారు రూ. 9.59 కోట్లు. కాబట్టి పోస్టులో షేర్ చేసిన చెక్ నిజం కాదని అర్ధమవుతుంది, పైగా ఆ చెక్‌లో చాలా తప్పులు కూడా ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని చెక్‌పై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుపై 2011లో ఇచ్చినట్టు ఉంది. కాని కాంగ్రెస్ పార్టీ 2011-12 సంవత్సరానికిగాను తీసుకున్న విరాళాలకి సంబంధించి ఎలక్షన్ కమిషన్‌కి అందించిన సమాచారంలో 98 కోట్లకి సంబంధించిన పద్దు లేదు. ఆ సంవత్సరం తీసుకున్న విరాళాలకి సంబంధించి మొత్తం 342 పద్దులు ఉన్నాయి, కానీ 2 కోట్లకు మించి ఒక్క పద్దు కూడా లేదు.

Myneta సమాచారం ప్రకారం 2011-12 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పొందిన మొత్తం విరాళాల విలువ రూ. 9.59 కోట్లు, పోస్టులో చెప్తున్న విలువకన్న ఇది చాలా తక్కువ.

ఒకవేళ నిజంగానే పద్దులు కాంగ్రెస్ పార్టీకి ఇలా చెక్ ఇచ్చిన విషయం బయటకి వచ్చి ఉంటే, మీడియా ఈ విషయంపై కథనాలు రాసేది, కానీ ఈ విషయానికి సంబంధించి మాకు ఎటువంటి వార్తా కథనం దొరకలేదు.  పైగా ఈ చెక్ ని పరిశీలించి చుస్తే, ఇందులో కొన్ని తప్పులు కనిపిస్తాయి. ఉదాహారణకి

  • చెక్ పై ఇంగ్లీష్ లో ‘Ninety’ కి బదులు ‘Ninenty’ అనే రాసి ఉంది.
  • చెక్ లో సంతకం కింద ఉన్న పేరు కొట్టివేయబడి ఉంది.

వీటన్నిటిబట్టి, వైరల్ అవుతున్న చెక్ నిజం కాదని అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ చెక్ చాలా సంవత్సరాల నుండే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. 2018 మరియు 2019లో ఇది వైరల్ అయినప్పుడు పలు ఫాక్ట్-చెకింగ్ సంస్థలు దీనిని డీబంక్ చేస్తూ రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, కాంగ్రెస్ పార్టీకి నీరవ్ మోదీ 98 కోట్ల విరాళం ఇచ్చినట్టు ఉన్న ఈ చెక్ నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll